దొరల దోపిడీ, అక్రమాలపై పల్లెల్లో తిరుగుబాటు.. చరమగీతం పాడిన తెలంగాణ రైతులు

 దొరల దోపిడీ, అక్రమాలపై పల్లెల్లో తిరుగుబాటు..  చరమగీతం పాడిన తెలంగాణ రైతులు

తెలంగాణలోని భూస్వాముల అరాచకాలు, పలు రకాల పన్నుల పేరుతో సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేశారు.  కొలనుపాక రైతుల పోరాటం కొలనుపాక గ్రామం భువనగిరి తాలుకా ఆలేరు సమీపంలో ఉంటుంది. ఆంధ్రమహాసభ నాయకులు ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి సోదరులు ఈ గ్రామానికి చెందిన వారే. కొలనుపాక జాగీర్దార్ నవాజ్ తురాజ్ యార్​జంగ్. కొలనుపాక ప్రాంత రైతుల నుంచి జాగీర్దార్ అనేక అక్రమ పన్నుల వసూలు చేసేవాడు. ప్రజలతో వెట్టిచాకిరి చేయించేవాడు. గ్రామాల్లో ఉన్న దళితులను ముస్లింలుగా మార్చే బలవంతపు మతమార్పిడి కార్యక్రమాన్ని చేపట్టాడు. బలవంతపు మత మార్పిడిలను వ్యతిరేకించిన ఆరుట్ల సోదరులు ఆర్యసమాజం కార్యర్తలను పిలిపించి మతమార్పిడి జరిగిన వారిని శుద్ధి ఉద్యమం ద్వారా తిరిగి హిందూమతం లోనికి మార్చారు. జాగీర్దార్ బలవంతపు మతమార్పిడిలే కొలనుపాక రైతుల పోరాటానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. 

షేక్ బందగీ భూపోరాటం
జనగామ తాలుకాలో విసునూరు గ్రామ దేశ్​ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి. ఈయన అనేక దౌర్జన్యాలకు పాల్పడేవాడు. షేక్ బందగీ ఒక పేద ముస్లిం రైతు. ఈయన స్వగ్రామం కామారెడ్డిగూడెం. షేక్ బందగీ కుటుంబంలో మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో పెద్దవాడు అబ్బాస్ అలీ విసునూరు దేశ్​ముఖ్ వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. మిగిలిన నలుగురు వ్యవసాయం చేసి జీవించేవారు. ఐదుగురు అన్నదమ్ములు విడిపోయి వారికి ఉన్న భూమిని పంచుకున్నారు. పెద్దవాడైన అబ్బాస్ అలీకి జ్యేష్ట భాగంగా ఎనిమిది ఎకరాలు ఎక్కువగా ఇచ్చారు. అబ్బాస్ అలీ తన ఎనిమిది ఎకరాలు అమ్ముకున్నాడు. అనంతరం తన తమ్ముళ్ల భూములను కాజేయాలని పన్నాగం పన్నాడు. ఇది అన్యాయమని మిగతా నలుగురి తరఫున షేక్ బందగీ వాదించాడు. దేశ్​ముఖ్​వద్ద పంచాయితీ పెట్టగా అబ్బాస్ అలీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. దాంతో షేక్ బందగీ కోర్టులో దావా వేశాడు. కోపోద్రిక్తుడైన దేశ్​ముఖ్,​ షేక్ బందగీని అనేక అవమానాలకు గురిచేశాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. దేనికీ భయపడిని షేక్ బందగీ కోర్టులో తుదివరకు పోరాటం చేశాడు. చివరకు కోర్టు తీర్పు షేక్ బందగీకి అనుకూలంగా వచ్చింది. 

కోర్టు తీర్పును అవమానంగా భావించిన విసునూరు దేశ్​ముఖ్, అబ్బాస్ అలీతో కలిసి షేక్ బందగీ హత్యకు పథకం వేశాడు. 1940, జులై 26న ఉదయం షేక్ బందగీ కోర్టు తీర్పు నకళ్లు తీసుకురావడానికి హైదరాబాద్​కు బయల్దేరాడు. బస్​స్టాపునకు వెళ్తున్న షేక్ బందగీపై విసునూరు దేశ్​ముఖ్ గూండాలు దాడి చేసి హత్యచేశారు. అతని సోదరులు, గ్రామ ప్రజలు బందగీ మృతదేహాన్ని బస్సు స్టేజీ దగ్గరనే పూడ్చి గోరి కట్టారు.

పరిటాల రైతు పోరాటం
పరిటాల జాగీర్దార్ నవాబ్ కమాల్ యార్​జంగ్. ఈయన జాగీర్​ ప్రజలను అనేక రకాలుగా పీడించి అక్రమ శిస్తులు  వసూలు చేసేవాడు. పరిటాల జాగీర్​లోని గ్రామాలు నిజాం రాజ్యం, బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేకుండా రెండింటి మధ్యలో ఉండేవి. పరిటాల జాగీర్దార్ దగ్గర పలుకుబడి సంపాదించిన లంకా సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రజలను అనేక రకాలుగా పీడించేవాడు. దీంతో ప్రజలు తిరుగుబాటు చేసి సుబ్రహ్మణ్యశాస్త్రిని హత్యచేశారు.  

బేతవోలు రైతుల పోరాటం
బేతవోలు ఒక జమిందారీ ప్రాంతం. ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలోని హుజూర్​నగర్ తాలుకాలో ఉన్నది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నది. బేతవోలు మఖ్తేదారు తడకమళ్ల సీతారామచంద్రరావు. బేతవోలు మఖ్తేదారుపై ఆ ప్రాంత ప్రజలు, రైతులు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం అక్రమ పన్నులు విధించడం. బేతవోలు మఖ్తేదారు విధించిన వివిధ రకాల పన్నులు. అవి.. సెంట్ల పన్ను, పుల్లరి పన్ను, దేవుని పన్ను, వివాహ పన్ను, చుట్టం పన్ను, దత్తత పన్ను, ఇల్లరిక పన్ను, ఆడబిడ్డ గంపలు, కౌలు పన్ను, మగ్గం పన్ను, మంత్రసాని పన్ను, సంతాన పన్ను, వ్యభిచార పన్ను. ఈ అక్రమ పన్నులతో విసుగెత్తిన రైతులు మఖ్తేదారుకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు. ఈ బేతవోలు రైతు పోరాటంలో సూర్యాపేటకు చెందిన ప్లీడర్ అమృతరెడ్డి రైతుల పక్షాన పోరాడారు.