
ఢిల్లీ: బ్లడ్ ఇన్ఫెక్షన్స్, న్యుమోనియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలపై యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా పనిచేయడం లేదని ఇండియన్ కౌన్సి్ల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజా నివేదికలో వెల్లడైంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) వార్షిక నివేదిక 2023 పరిశోధనల్లో భాగంగా ఐసీఎంఆర్ వార్షిక డేటా కలెక్ట్ చేసింది. ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుండటంపై ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 99,492 శాంపిల్స్ను దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ సేకరించింది.
జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్యలో ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసింది. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీబయాటిక్స్ ఐసీఎంఆర్ స్టడీ చేసింది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి, యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గిపోయిందని ఈ స్టడీలో తేలింది. దేశవ్యాప్తంగా 21 రీజనల్ సెంటర్స్ నుంచి రకరకాల ఇన్ఫెక్షన్లకు సంబంధించిన బ్లడ్, యూరిన్.. ఇతర శాంపిల్స్ను సేకరించి ఐసీఎంఆర్ ఈ స్టడీ చేసింది.
యాంటీ బయాటిక్స్అతిగా వాడడం వల్ల ఇన్ఫెక్షన్లపై సరైన ప్రభావం చూపించలేకపోతున్నాయి. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికీ జనాలు యాంటీ బయాటిక్లను వాడుతుండడం వల్ల బ్యాక్టీరియాలు వాటికి నిరోధకతను (రెసిస్టెన్స్) సంతరించుకుంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీబీ మరణాల్లో 50% యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లే సంభవిస్తున్నాయి. నిజానికి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్లను అమ్మడానికి వీల్లేదు. కానీ, ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మెడికల్ షాపుల్లో అమాక్సిసిలిన్, సెఫిక్సిమ్, సిప్రొఫ్లోక్సాసిన్ వంటి యాంటీ బయాటిక్లను అమ్ముతున్నారు.
డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు, కొంత మంది క్వాలిఫైడ్ డాక్టర్లూ చిన్న చిన్న రోగాలకే ఎక్కువ డోస్ యాంటీ బయాటిక్లను రోగులకు ఇస్తున్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే కమీషన్లకు ఆశపడి, జ్వరం, చిన్న చిన్న గాయాలకు పవర్ఫుల్ యాంటీబయాటిక్లను ఇస్తున్నారు. ఇలా ఎక్కువ వాడడం వల్ల కొంతకాలానికి రెసిస్టెన్స్ రావడంతో పాటు సైడ్ ఎఫెక్ట్లూ వచ్చే ముప్పుంది.