తమ డేటా పోయిందన్న సంగతే తెలియదు

తమ డేటా పోయిందన్న సంగతే తెలియదు
  • ముగ్గురిలో ఒకరి పరిస్థితి ఇదే.. వెల్లడించిన రుబ్రిక్​ సర్వే

న్యూఢిల్లీ:  సైబర్ దాడుల్లో వ్యక్తిగత డేటాను కోల్పోయామని చాలా మందికి తెలియదని తాజా సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం ముగ్గురిలో ఒకరు సైబర్ దాడిలో తమ వ్యక్తిగత డేటాను పోగొట్టుకున్నారని, వారికి దాని గురించి కూడా తెలియదని సైబర్​ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్​ తెలిపింది. ఐటీ పరిశ్రమకు చెందిన 1,600 కంటే ఎక్కువ కంపెనీలతో ఇది  వేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రీసెర్చ్​తో సర్వే చేయించింది.  

500 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఐటీ కంపెనీల అధికారులు ఇందులో పాల్గొన్నారు.  రుబ్రిక్  సీఈఓ బిపుల్ సిన్హా మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా సైబర్ పరిశ్రమ సమిష్టిగా సంవత్సరానికి  200 బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది.  మా రుబ్రిక్ జీరో ల్యాబ్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గురిలో ఒకరు సైబర్ దాడిలో వారి వ్యక్తిగత డేటాను కోల్పోయారు. 

ఆ సంగతే వారికే తెలియదు ”అని చెప్పారు.  ఈ ఏడాది జూన్ 30– జూలై 11 మధ్య యూఎస్​, యూకే,  భారతదేశంతో సహా 10 దేశాల్లో వేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రీసెర్చ్ సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న సగానికి పైగా (53 శాతం)  సంస్థలు గత సంవత్సరంలో ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయాయి. ప్రతి ఆరు సంస్థల్లో ఒకటి (16 శాతం) 2022లో చాలా నష్టాలను చవిచూసింది.

 భారతదేశంలో  49 శాతం మంది ఐటీ లీడర్లు తమ సంస్థ  డేటా పాలసీలో సెక్యూరిటీకి తగిన ఇంపార్టెన్స్​ ఉండటం లేదని భావిస్తున్నారు. అయితే 30 శాతం మంది తమ సంస్థలకు వచ్చే 12 నెలల్లో సున్నితమైన డేటాను కోల్పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. కొన్ని రకాల సైబర్​ అటాక్​లను అసలు అడ్డుకోవడమే సాధ్యం కాదని  సిన్హా అన్నారు. 

 ఒక సాధారణ సంస్థ భద్రపరచాల్సిన మొత్తం డేటా పరిమాణం వచ్చే సంవత్సరంలో దాదాపు 100 బీఈటీబీ (బ్యాక్- ఎండ్ టెరాబైట్) పెరుగుతుందని,  వచ్చే ఐదేళ్లలో 7 రెట్లు పెరుగుతుందని అన్నారు. పెరుగుతున్న డేటాను భద్రపరచడం తమ వల్ల కావడం లేదని కొన్ని సంస్థలలోని ఐటీ కంపెనీలు అంగీకరించారని సిన్హా అన్నారు. ఇలా చెప్పిన వాటిలో ఇండియా నుంచి 34 శాతం కంపెనీలు ఉన్నాయని తెలిపారు.