తమిళ సినిమా థీమ్​తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న రెస్టారెంట్

తమిళ సినిమా థీమ్​తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న రెస్టారెంట్

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈమధ్య థీమ్​ బేస్డ్ రెస్టారెంట్లు తెస్తున్నారు నిర్వాహకులు. అలాంటిదే తమిళనాడు మధురైలో ఉన్న ‘సిని సువాయ్​’ రెస్టారెంట్. తమిళ సినిమా థీమ్​తో ఉన్న ఈ రెస్టారెంట్​ అక్కడ చాలా ఫేమస్​.  తమిళంలో ఒకప్పుడు, ఈమధ్య వచ్చిన హిట్​ సినిమాల్ని మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్న ఈ రెస్టారెంట్ గురించి..

ఫుడ్​తో పాటు తమిళ సినిమాల్ని బాగా ఇష్టపడేవాళ్ల కోసం ‘సిని సువాయ్​’ రెస్టారెంట్​ని ఏర్పాటు చేశారు. పేరుకు తగ్గట్టే ఈ రెస్టారెంట్​లో  తమిళంలో హిట్ అయిన సినిమా పోస్టర్లు,  ఆ సినిమాల్లో హీరోలు వాడిన బైక్​లు, కార్లు కనిపిస్తాయి. ఉదాహరణకు.... ‘లక్ష్మి’ సినిమాలో రజనీకాంత్ నడిపిన ట్యాక్సీ లాంటి కారుని ఇక్కడ డైనింగ్ టేబుల్​గా మార్చేశారు. అలాగే ‘మారి’ సినిమాలో ధనుష్ నడిపిన ఆటోను పోలిన ఆటోని  సెల్ఫీబూత్​గా చేశారు. 1960 నుంచి ఈ ఏడాది వచ్చిన తమిళ హిట్​ సినిమా పోస్టర్లని ఇక్కడ చూడొచ్చు. 

వేలంలో రైలు బోగీ కొని... 

తమిళంలో పాపులర్ హీరో శివాజీ గణేశన్ ‘థిల్లానా మొహనంబళ్’ సినిమాలో, మాధవన్ ‘అలాయ్​పయుతె’, సూర్య నటించిన ‘వారణం ఆయిరం’ సినిమాల్లో రైలు సీన్లు ఉంటాయి. అందుకని ఒక పాత రైల్వే బోగిని వేలంలో కొని, దానికి రంగులు వేశారు. లోపల కుర్చీలు, టేబుళ్లు వేసి రెస్టారెంట్​ లుక్ తెచ్చారు. బోగీ గోడల మీద ఫుడ్​ గురించి తమిళ సినిమాలోని  డైలాగ్​లు ఉన్న పోస్టర్లని పెట్టారు. ఈ బోగీ ఒక్కటే కాదు ఆ రెస్టారెంట్​లో మరెన్నో  అట్రాక్టివ్​ గదులున్నాయి. 

వడ్డించేవాళ్లు కూడా...

ఈ రెస్టారెంట్​లో సినిమా థీమ్​కు తగ్గట్టే  క్లాప్​ బోర్డ్​లాంటి  టిష్యూ బాక్స్​, సినిమా రీల్​లా ఉండే బిల్​బోర్డులు ఉంటాయి. ఈ రెస్టారెంట్​లో హ్యాండ్​వాష్​ రూమ్​​ కూడా అద్దాలు, లైట్లతో అచ్చం సినిమా హీరోలు, హీరోయిన్ల  క్యారెవ్యాన్​లానే  ఉంటుంది. అంతేకాదు వడ్డించే మగవాళ్లు  హీరో రజినీకాంత్, ధనుష్​, కమెడియన్​ వడివేలు లాగా డ్రెస్​ వేసుకుంటారు. ఆడవాళ్లేమో సరోజాదేవిలా రెడీ అవుతారు. రజనీకాంత్​ స్టయిల్లో కస్టమర్లకు నమస్కారం పెడతారు. ఈ రెస్టారెంట్​లో తమిళ వంటకాలతో పాటు పంజాబీ రెసిపీలు కూడా దొరుకుతాయి. అరబిక్, థాయ్, చైనీస్, జపనీస్, ఇటాలియన్, అమెరికన్​ వంటకాలకి కూడా ఈ రెస్టారెంట్ ఫేమస్​.  ఇందులో ఒకేసారి 300 మంది తినొచ్చు.