కేటీఆర్ సభ కోసం రోడ్డుపై నిలిపిన డీసీఎం వ్యాన్లు.. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

కేటీఆర్ సభ కోసం రోడ్డుపై నిలిపిన డీసీఎం వ్యాన్లు.. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. 

మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు డీసీఎం వాహనాలను ఏర్పాటు చేశారు. నాలుగు డీసీఎం వాహనాలను శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచారు. ఈ సమయంలోనే..  హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ కు వెళ్తున్న  ఆర్టీసీ బస్సు... శంషాబాద్ కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకోగానే రోడ్డుపై నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాదానికి గురైన డీసీఎం వాహనం.. ముందున్న మరో మూడు వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నాలుగు డీసీఎం వాహనాలు ధ్వంసమయ్యాయి. 

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ బస్సును అతివేగంగా.. నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.