2023లో  కేంద్రంలో ఓబీసీ శాఖ ఏర్పాటైతదేమో! : మంత్రి కేటీఆర్

2023లో  కేంద్రంలో ఓబీసీ శాఖ ఏర్పాటైతదేమో! : మంత్రి కేటీఆర్

ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2023 బడ్జెట్ లో దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ సానుకూల ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తగినంత బడ్జెటరీ కేటాయింపులతో ఓబీసీ మంత్రిత్వ శాఖను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.  

అంతకుముందు 2004 సంవత్సరంలోనూ ఇవే విజ్ఞప్తులతో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఓబీసీ నాయకుల బృందం నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ఆ బృందం కోరినప్పటికీ.. నాటి యూపీఏ సర్కారు పెడచెవిన పెట్టిందని తెలిపారు. 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కేసీఆర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కలిసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ కు ‘ఓబీసీ అప్నా హక్ మాంగో’... ‘మినిస్ట్రీ ఆఫ్ ఓబీసీ’ అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించారు.