ఏపీ, తెలంగాణలో వరుస దొంగతనాలు

ఏపీ, తెలంగాణలో వరుస దొంగతనాలు
  •  పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  •  రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం

ఉప్పల్, వెలుగు: తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని వందకు పైగా చోరీలు చేసిన పాత నేరస్తుడిని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉప్పల్ పీఎస్​లో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి వివరాలు వెల్లడించారు. తుర్కయంజాల్​కు చెందిన ఆవుల కిరణ్ అలియాస్ రాహుల్(33) మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం చోరీలు చేయడం మొదలు పెట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ముందస్తుగా రెక్కీ నిర్వహించి పగటి పూట మాత్రమే దొంగతనాలు చేసేవాడు. ఇలా దొంగిలించిన బంగారం, వెండి, విలువైన వస్తులను అమ్మి ఆ డబ్బును జల్సాలకు వాడుకునేవాడు. ఏపీ, తెలంగాణలో చాలా దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లి వచ్చినా కిరణ్ తీరు మారలేదు. పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ చోరీలు చేసేవాడు. ఈ నెల 5న నాచారంలోని ఓ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన కిరణ్ 13.5 తులాల బంగారం, 75 తులాల వెండి నగలు తీసుకుని పారిపోయాడు. బాధితుడి కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కిరణ్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే చోరీ చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో రూ.13 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు. కిరణ్ ఇప్పటి వరకు వందకుపైగా చోరీలు చేశాడన్నారు. ఓ చోరీ కేసులో ఏలూరు పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి 45 రోజుల కిందట రిలీజై బయటకు వచ్చాడన్నారు. తర్వాత సిటీకి వచ్చి మళ్లీ చోరీలు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

మామ ఇంట్లో దొంగతనం.. ఒకరి అరెస్ట్

మేడిపల్లి: మామ ఇంట్లో చోరీకి పాల్పడిన అల్లుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా ఇసుకపర్తి గ్రామానికి చెందిన ఆచి వెంకటేశ్వరరావు(27) రెండేండ్ల కిందట సిటీకి వచ్చి కుటుంబసభ్యులతో కలిసి బోడుప్పల్​లోని ఎన్ఐఎన్ కాలనీలో ఉంటున్నాడు. స్థానిక బిల్డర్, వరసకు మామ అయ్యే శ్రీను ఇంటికి వెంకటేశ్వరరావు తరచూ వెళ్లేవాడు. కన్​స్ట్రక్షన్​లో శ్రీనుకు వచ్చే డబ్బును  చూసి కొట్టేయాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 1న శ్రీను వేరే ఊరికెళ్లినట్లు తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లాడు. అత్త ఒక్కరే ఇంట్లో ఉండటాన్ని గమనించాడు. ఆమె వేరే పనిలో ఉండగా.. వెంకటేశ్వరరావు బెడ్రూంలోకి వెళ్లి అల్మారాలో ఉన్న రూ.12 లక్షలు క్యాష్, 45 గ్రాముల బంగారు నగలను తీసుకుని పరారయ్యాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన మేడిపల్లి పోలీసులు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.11 లక్షల క్యాష్, 43 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.