రాజ్యసభ కార్యకలాపాలు జరిగింది 21 శాతమే

రాజ్యసభ కార్యకలాపాలు జరిగింది 21 శాతమే

న్యూఢిల్లీ: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రెండు వారాల్లో ఒక్క బిల్లు కూడా పాస్​ కాలేదు. తొలి వారంతో పోలిస్తే.. రెండో వారంలో రాజ్యసభ కార్యకలాపాలు మరింత తగ్గాయి. తొలి వారం 27% సభ జరిగితే.. రెండో వారంలో అది 16 శాతానికి పడిపోయింది. మొత్తంగా రెండు వారాలను కలిపితే సభ జరిగింది 21.58 శాతం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా పది రోజులు సభ జరిగితే 11 గంటల 8 నిమిషాలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగాయి. వాస్తవానికి 51 గంటల 35 నిమిషాలు జరగాలి.

ప్రతిపక్షాల ఆందోళనలతో 40 గంటల 45 నిమిషాలు వృథా అయ్యింది. ఎటువంటి చర్చా జరగకపోవడంతో ఒక్క బిల్లు కూడా పాస్​ కాలేదు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు, అగ్నిపథ్​ స్కీమ్​ తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనపై రాజ్యసభ చైర్మన్​ ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

తొలుత ధరల పెరుగుదల.. తర్వాత అగ్నిపథ్​

పార్లమెంట్​లో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్షాలు ఈ వారం కూడా తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నాయి. ఒకవేళ ఉభయసభల్లో ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం చర్చ చేపడితే.. ఆ తర్వాత అగ్నిపథ్​ స్కీముపై చర్చకు 
పట్టుబట్టాలని భావిస్తోంది.