కేసీఆర్​ కోసం యూపీ నుంచి స్పెషల్ బస్సు

కేసీఆర్​ కోసం యూపీ నుంచి స్పెషల్ బస్సు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కేసీఆర్​కు ఉత్తరప్రదేశ్​ నుంచి ప్రత్యేక బస్సును తెప్పించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్​ ఈ బస్సును సమకూర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బస్సుపైన ‘భారత రాష్ట్ర సమితి’ అని రాసి.. ఎడమ వైపున కారు గుర్తు, కుడి వైపున కేసీఆర్ ఫొటో ముద్రించారు. బస్సు అద్దం కింద ‘తెలంగాణ ప్రగతి రథం’ అని రాశారు. ఉత్తర ప్రదేశ్​లోనే ఈ బస్సు రిజిస్ట్రేషన్​ చేయించారు.

 ‘‘యూపీ 32 జీఎం 1990” నంబర్​ ఉన్న ఈ బస్సును సిక్కు డ్రైవర్ ​నడిపించారు. ఆదివారం ఈ బస్సులోనే హైదరాబాద్ ​నుంచి కేసీఆర్​ హుస్నాబాద్​కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంది. అభ్యర్థులతో సమావేశం, బీఫామ్​లు అందజేత, ప్రెస్​మీట్, ఇతర కార్యక్రమాలతో ఆలస్యం కావడంతో హెలికాప్టర్​లో కేసీఆర్​ హుస్నాబాద్​కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునేసరికే కొత్త బస్సును అక్కడ హెలిప్యాడ్​ వద్ద రెడీగా ఉంచారు. అదే బస్సులో మంత్రి హరీశ్​రావు, ఇతర నాయకులతో కలిసి కేసీఆర్​ సభ వేదిక వద్దకు వచ్చారు. సోమవారం నుంచి జరిగే ప్రచార సభల్లోనూ ఇదే బస్సును కేసీఆర్​ ఉపయోగించనున్నారు.