ఎస్సీ ఉప కులాలకు స్పెషల్​ కార్పొరేషన్ ​పెట్టాలి

ఎస్సీ ఉప కులాలకు స్పెషల్​ కార్పొరేషన్ ​పెట్టాలి
  •      తెలంగాణ ఎస్సీ 57 ఉప కులాల ఐక్యవేదిక డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​హయాంలో 57 ఎస్సీ ఉప కులాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలంగాణ ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ఏ పార్టీ కూడా ఉప కులాలను పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడింది. గడిచిన పదేండ్లలో తమ బాధలు చెప్పుకుందామంటే నాయకులే లేరని, కాంగ్రెస్​ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని కోరింది. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. 

ఐక్యవేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది సంచార జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిల్లల్ని చదివించుకుందామంటే క్యాస్ట్​సర్టిఫికెట్లు రావడం లేదని చెప్పారు. మాల, మాదిగలను పట్టించుకుంటున్న పార్టీలకు ఉపకులాలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో 57 ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, సీఎం స్పందించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మేడి పాపయ్య, బానాల మంగేశ్, ఏర్పుల యాదయ్య, కొండూరు రవి, ఎల్లేశ్, రాములు, రవి, హరి, దశరథ్, రమేశ్​తో వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.