సైన్మాల్లో తెలంగాణ!

సైన్మాల్లో తెలంగాణ!

‘‘అట్లుంటది మనతోని...’’ అని ఈ మధ్య థియేటర్​లల్ల హల్​చల్ జేశిండు ‘డీజేటిల్లు’. ‘‘నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టెలిని గట్టేశినట్టే...’’ అని పంచ్ డైలాగులు పేలుస్తడు ఓ స్టార్ హీరో. ఇప్పుడివే ట్రెండింగ్ డైలాగ్స్. తెలంగాణ ట్రేడ్ మార్క్స్. తెలంగాణ తనానికి, తెలంగాణ సినిమాకు కాసులురాలే కాలం వచ్చింది. ఇదంతా పుక్కిట్ల రాలే.  దీని ఎనక మస్తు కతున్నది. అదేందో సూడుర్రి మల్ల!

తెలుగు సినిమాల్లో తెలంగాణతనం చాలా తక్కువ. తెలుగుదనం పేరుతో కనబడేదంతా ఆ రెండు కోస్తా జిల్లాల వేషభాషలే. తెలంగాణ రాష్ట్రంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో భాగంగా సంస్కృతీ సంప్రదాయాలను తన ప్రత్యేకతలుగా ఎలుగెత్తి చాటింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ తనంతో వెండితెర వెలిగిపోతోంది. 

ఇప్పుడు ఈ గడ్డపై పుట్టిన టాలెంటెడ్ హీరోలు కూడా తమదైన శైలితో రెండు రాష్ట్రాల తెలుగు ఆడియెన్స్​ని ఆకట్టుకుంటున్నారు. కళకు ప్రాంతం లేదని.. కొత్తగా సినిమాలు తీస్తే.. ప్రాంతీయ బేధం లేకుండా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులూ నిరూపించారు. దీనికి ఫిదా, మల్లేశం, పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు వంటి సినిమాలు చక్కటి ఉదాహరణ. తెలంగాణ ప్రాంత యాస, భాషలతో పూర్తిగా ఓ కొత్త కోణంలో తెరకెక్కించిన సినిమాలివి. 

మొన్నటి వరకూ తెలుగు వెండితెరపై ఊహకు కూడా అందని తెలంగాణ హీరోలు.. ఇక్కడి యాస, కల్చర్ చూపించే సినిమాల్లో నటించి హిట్​లు కొడుతున్నారు. అయితే ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. సినిమా చరిత్రలోకి వెళితే... తొలి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుడు కృష్ణాజీ రావు షిండే నుంచి మొదలుపెట్టాలి. మూకీ సినిమాల సమయంలోనే బెంగాలీ సినిమా ప్రొడ్యూసర్ ధీరేన్ గంగూలి హైదరాబాద్​లో సినిమాలు నిర్మించాడు. 

మద్రాసు నుండి తెలుగు సినీపరిశ్రమను తెలుగు రాష్ట్రానికి తేవాలన్న సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు1974లో స్టూడియో కట్టేందుకు హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌‌లో 22 ఎకరాల స్థలాన్ని అక్కినేని నాగేశ్వరరావుకు ఇచ్చారు. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌‌లో మొదటిసారి నిర్మాణ వసతులతో అన్నపూర్ణ స్టూడియో వెలిసింది. హైదరాబాద్‌‌లో విరివిగా సినిమా షూటింగ్‌‌లు జరగడంతో సినిమా సంగతులు కొంత తెలంగాణ వారికి కూడా తెలిసే అవకాశం వచ్చింది. సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నా సినిమాలు నిర్మించిన తెలంగాణ వాసులు కొందరు ఉండడం విశేషమే.

సినీ నిర్మాణ రంగంలో  కాలు పెట్టడానికి తెలంగాణకు చాలాకాలం పట్టింది. హైదరాబాద్​ కేంద్రంగా రకరకాల ప్రాంతాల వారు మూకీలు, టాకీలు నిర్మించినా తెలంగాణ జిల్లాల నుంచి చిత్ర నిర్మాణం చేయడం1960 ప్రాంతంలో మొదలైందనొచ్చు. కరీంనగర్‌‌కు చెందిన కె.కె.రెడ్డి1966లోనే ‘‘ముజ్రింకౌన్?’’ అనే హిందీ సినిమాను ప్రొడ్యూస్ చేసి, డైరెక్షన్​ కూడా చేశారు. ఆరోజుల్లో కరీంనగర్‌‌ జిల్లా పట్టణాల్లో ఆ సినిమా పోస్టర్లలో కె.కె.రెడ్డి పేరు చూసి జిల్లావాసులు ఉప్పొంగిపోయారు. ఆ తర్వాత ఆయన హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు తీశారు.1987లో ‘తేరా రబ్‌‌ మేరా ధం’,1988లో ‘పాప్‌‌ కో జలాకర్‌‌ రాఖ్‌‌ కర్‌‌ దూంగా’ అనే భారీ హిందీ సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. నటి దివ్యభారతి నటించిన చివరి చిత్రమిది.

1971లో నిజామాబాద్‌‌కు చెందిన బిక్కులాల్ అగర్వాల్, జ్ఞాన్‌‌చంద్ గుప్తాలు కలిసి ‘‘జేమ్స్‌‌బాండ్ 777’’ సినిమాలు తీశారు.1975లో కాకతీయ పిక్చర్స్‌‌వారు టి.మాధవరావు దర్శకత్వంలో ‘‘చిల్లర దేవుళ్లు’’ నిర్మించారు. ఇది దాశరధి నవల చిల్లర దేవుళ్లు ఆధారంగా రూపొందించింది. ఇందులో పాత్రల మాటలు కూడా అచ్చ తెలంగాణ యాసలో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు టి.మాధవరావు తెలంగాణ బిడ్డే.1979లో జగిత్యాలకు చెందిన డి.హన్మాండ్లు ‘గాలివాన’ అనే సినిమా నిర్మించాడు. ఆర్‌‌.వి.ఎస్‌‌.రామస్వామి కథ, పాటలు సమకూర్చిన ఈ చిత్రానికి కొపల్లె సివరాం పాటలు రాశారు. సంగీతం పెండ్యాల. దర్శకత్వం ఆదిరాజు ఆనందమోహన్‌‌. అదే సంవత్సరం మందమర్రికి చెందిన శ్రీపతిరావు ‘ప్రియబాంధవి’ అనే సినిమా నిర్మించారు. 

1984లో కరీంనగర్‌‌కి చెందిన నారదాసు లక్ష్మణ్​రావు ఇతర మిత్రుల నిర్మాణంలో ‘విముక్తి కోసం’ సినిమా వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ శ్రీకాకుళ సాయుధపోరాటం. దీనికి ఉదయకుమార్‌‌ దర్శకుడు. ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరోజినీ దేవి జాతీయ సమైక్యత పురస్కారం లభించింది. హైదరాబాద్‌‌కు చెందిన బాదం రామస్వామి భాగ్యనగర్ స్టూడియోస్ తరఫున సినీ నిర్మాణం చేపట్టారు. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు కొందరయితే ప్రయత్నించి విఫలమయిన వాళ్ళు ఎందరో. 

ఆ ముగ్గురు నటులు!

1931లో తెలుగులో తొలి టాకీ చిత్రం మొదలయింది. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో ఆంధ్ర ప్రాంత ప్రాతినిధ్యం మాత్రమే ఉండేది. నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు అందరూ ఆంధ్రులే. ఆంధ్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్న నల్గొండ జిల్లా నుండి టి.ఎల్‌‌.కాంతారావు, ప్రభాకర్‌‌ రెడ్డి, త్యాగరాజు (వరంగల్).. వీళ్లు తప్ప తొలినాళ్లలో తెలుగు సినిమాలో తెలంగాణ నటులెవరూ కనిపించరు.1951లో కాంతారావు సినీరంగంలో ప్రవేశించి, జానపద, పౌరాణిక, చిత్రాల్లో నటించి ఎన్‌‌,టి.రామారావుకు సమ ఉజ్జీగా నిలిచారు.  

అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా, విలన్‌‌గా మెప్పించిన నటుడు ప్రభాకర్ రెడ్డి.  డాక్టర్ మందడి ప్రభాకర్‌‌ రెడ్డి  తన 37 ఏళ్ల కెరీర్‌‌లో 472 సినిమాల్లో నటించి నటనలో తనదైన ముద్ర వేశారు. 1960లో ‘చివరకు మిగిలేది’ సినిమాతో నటుడిగా ప్రవేశించిన ప్రభాకర్‌‌ రెడ్డి రెండు సార్లు ఉత్తమ నటుడిగా(1980లో యువతరం కదిలింది, 1981లో పల్లె పిలిచింది) నంది అవార్డులను అందుకున్నారు. పండంటి కాపురం, కార్తీకదీపం, గృహప్రవేశం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు వంటి దాదాపు 21 సినిమాలకు కథారచన కూడా చేశారు. వీటిలో కొన్నింటికి ఆయన నిర్మాత. ఇలాంటి రికార్డు సృష్టించి తెలంగాణ వ్యక్తిగానే కాదు తెలుగువాడిగా అన్ని ప్రాంతాల ప్రజల్లో నిలిచిపోయారు. విలన్​ పాత్రలో ఇమిడిపోయిన త్యాగరాజు తన డైలాగ్​ డెలివరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. విలన్​గానే కాకుండా ఇతర క్యారెక్టర్స్​లో కూడా నటించారు. 

పాల్కే అవార్డు అందుకున్న తెలంగాణ నటుడు

తెలంగాణ కళాకారులకు అందరికన్నా ముందుగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన నటుడు పైడి జైరాజ్. తెలంగాణలోని కరీంనగర్‌‌లో పుట్టిన జైరాజ్.. తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించక పోయినా బాలీవుడ్‌‌లో ఆయనకంటూ సూపర్ స్టార్ ఇమేజ్‌‌ను సొంతం చేసుకున్నారు.1980లో పైడి జైరాజ్.. ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు.  జైరాజ్ ప్రతిభను దేశమంతా గుర్తు పెట్టుకున్నా తెలుగు జనానికి మాత్రం ఈ సూపర్ స్టార్‌‌ గురించి  అంతగా తెలియక పోవడం ఆశ్చర్యమే. 

ఆర్ట్ ఫిలిం.. తెలంగాణ హార్ట్ ఫిలిం

డిష్యుం డిష్యుం సినిమాలు రాజ్యమేలే సమయంలో అత్యుత్తమ కళాత్మక సినిమాలు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాయి. 1978లో ‘‘ఒక ఊరి కథ’’ చిత్రాన్ని మృణాల్ సేన్ తీశాడు. తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ పరిణామాలను ఇందులో చూపించారు. ప్రేమ్ చంద్ రాసిన కఫన్ కథ దీనికి ఆధారం. ఇలా  దశాబ్దాల క్రితం పునాదులు వేసి తెలంగాణ సినిమాకు దిక్సూచిగా నిలిచిన ఆ దర్శకులు, దార్శనికులు ఎవరంటే... 

ప్యారలల్ సినిమా పాఠాలు బెనెగల్ సినిమాలు

శ్యామ్ బెనగల్​ ఈ పేరు వినని సినీ ప్రేమికుడు ఉండరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ డైరెక్టర్ బాలీవుడ్‌‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తీసారు. అంకుర్, నిశాంత్, మేకింగ్ ఆఫ్ మహాత్మా, బోస్ - ఫర్గాటెన్ హీరో ఇలాంటి గొప్ప చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ‘పద్మశ్రీ’ అవార్డే కాకుండా ‘దాదా సాహెబ్ పాల్కే’ అవార్డును అందుకున్నాడు శ్యామ్ బెనగల్. ‘కొండు రా’ పేరుతో హిందీలో, ‘అనుగ్రహం’ పేరుతో తెలుగులో ఒక ఢిపరెంట్ సినిమా కూడా తీశాడు శ్యామ్ బెనగల్.

అంధుడి దర్శకత్వం మార్గదర్శకం

ప్యారలల్ సినిమాల్లో ఓ మైలురాయిగా నిలిచిన ‘నిమజ్జనం’ ఈ సినిమా డైరెక్టర్ బి.ఎస్.నారాయణ కరీంనగర్ జిల్లా వాసి. ‘ఊరుమ్మడి బతుకులు’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు వెండితెరపై రియలిస్టిక్ కథనాలకు పునాదులు వేశారు. ఆయన వయసు పైబడి కంటి చూపు కోల్పోయాడు. ‘మార్గదర్శి’ అనే సినిమా డైరెక్ట్ చేసి ప్రపంచ సినీ చరిత్రలోనే డైరెక్షన్ చేసిన చూపులేని వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 

తెలంగాణ రంగుల కలలు

బి. నర్సింగరావు తెలుగులో ఆర్ట్ ఫిలిమ్ మూవ్‌‌మెంట్‌‌కు ఆద్యుడు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌‌కు చెందిన ఈయన తీసిన సినిమాలన్నీ తెలంగాణ బతుకు చిత్రాలుగా నిలిచిపోయాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్​, యాక్టర్, మ్యుజీషియన్​, పొయెట్​, పెయింటర్‌‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి. 1980లో బి.నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’ వచ్చింది. తెలంగాణ సాయుధపోరాటం కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు బెంగాలీ వాడైన గౌతం ఘోష్‌‌ డైరెక్ట్ చేశారు. కిషన్‌‌ చందర్‌‌ రాసిన ‘జబ్‌‌ ఖేత్‌‌ జాగీ’ నవలికకు చిత్రరూపమిది. అపూర్వ ప్రజాదరణతో విజయవంతంగా నడచిన మాభూమి ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్​కు వెళ్లింది. వంద గొప్ప భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రాన్ని సిఎన్‌‌ఎన్‌‌ గుర్తించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ స్క్రీన్‌‌ప్లేగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది.1983లో బి.నర్సింగరావు తన డైరెక్షన్​లోనే ‘రంగుల కల’ ప్రొడ్యూస్​ చేశారు. ఇందులో ఆయనే హీరో. ఆర్టిస్ట్​ల మానసిక సంఘర్షణ ఆధారంగా తయారైన ఈ సినిమాకు బెస్ట్ తెలుగు మూవీగా జాతీయ అవార్డ్​ దక్కింది. కె.శకుంతల బెస్ట్ సపోర్టింగ్​ యాక్టర్​గా నంది అవార్డు అందుకుంది.దాసి, మట్టిమనుషులు, మావూరు లాంటి సినిమాలకు, డాక్యుమెంటరీలకు కూడా నర్సింగరావు దర్శకత్వం వహించి ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్స్​లో ‘వహ్వా’ అనిపించుకున్నారు. తెలంగాణ సినిమాకు దీపస్తంభమాయన. కమర్షియల్ సినిమాతో దుమ్ము లేపేస్తున్నారు.తెలంగాణ సినిమా అంటే కేవలం ఆర్ట్ సినిమా, ఉద్యమ సినిమాలే కాదు. పాటలు, ఫైట్లు, అలరించే అనేక అంశాలతో అద్భుతంగా తీయగలమని చూపిస్తున్నారు నవతరం డైరెక్టర్స్​. 

నల్గొండ జిల్లాకు చెందిన నిమ్మల శంకర్ కమర్షియల్ మెయిన్‌‌ స్ట్రీమ్ ఫార్మాట్‌‌లోనే తెలంగాణ మట్టివాసన గుర్తుచేసే సినిమాలను తీశారు.1997లో ‘‘ఎన్‌‌కౌంటర్’’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తెలంగాణ ఉద్యమం కథాంశంతో సమకాలీన పరిణామాలను చూపిస్తూ  తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూవ్​మెంట్’గా పేరు తెచ్చుకుంది. ఆ తరవాత అల్లాణి శ్రీధర్ ‘కొమరం భీమ్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ జీవిత కథను తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించారు. 1993లో అయన డైరెక్షన్​లో జగిత్యాలకు చెందిన శివ ప్రొడక్షన్స్‌‌ వారు ‘ప్రేమే నాప్రాణం’ నిర్మించారు. మరిన్ని సినిమాలకు డైరెక్ట్​ చేసిన శ్రీధర్‌‌ది తెలంగాణ సినిమా రంగంలో మెయిన్​ రోల్.

1996లో ‘పిట్టల దొర’ సినిమా ద్వారా రంగప్రవేశం చేసిన సానా యాదిరెడ్డి ఈ రంగంలో ‘సంపంగి’ తో విజయాన్ని అందుకున్నారు.
ఎల్‌‌.శ్రీనాథ్‌‌ డైరెక్ట్​ చేసిన ‘కుబుసం’, టి.ప్రభాకర్‌‌ డైరెక్షన్​లో వచ్చిన ‘బతుకమ్మ’ కూడా తెలంగాణ ముద్ర ఉన్న సినిమాలే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా ఉద్యమానికి అనుకూలంగా సినిమాలు వచ్చాయి. తెలంగాణాకు చెందిన చాలామంది డైరెక్టర్స్ తెలుగు సినీ తెరపై తమ సత్తా చాటుతున్నారు. వాళ్ళు దశరథ్, హరీష్ శంకర్, సంపత్ నంది, నందిని రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి, క్రాంతి మాధవ్, టి.ప్రభాకర్, రఫీ, ప్రేమ్‌‌రాజ్‌‌ సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి వంటి ఎంతో మంది డైరెక్టర్స్​ తమ సత్తా చాటుతున్నారు. అటు ‘అర్జున్ రెడ్డి’ మూవీతో మొదలైన సందీప్ రెడ్డి వంగా హవా ‘కబీర్ సింగ్’​తో బాలీవుడ్​ను కూడా షేక్ చేసింది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి, ‘మహానటి’తో నాగ్ అశ్విన్, ‘నీది నాది ఒకే కథ’తో వేణు ఊడుగుల,‘పెళ్లి చూపులు’ సినిమాతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్. మెగాస్టార్ తో ఛాన్స్ కొట్టేసిన వెంకీ కుడుముల. ‘జాతి రత్నాలు’తో అందరినీ నవ్వించిన అనుదీప్. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ శ్రీరామ్ వేణు. ‘భీమ్లా నాయక్’ తో దుమ్ము లేపిన సాగర్ చంద్ర, వీళ్లంతా తెలంగాణ బిడ్డలే. 

తెలంగాణ భాషకి, యాసకి గౌరవం

కొంతకాలంగా సినిమాల్లో మాండలికాల ప్రభావం మరికాస్త జోరందుకుంది. ఉత్తరాంధ్ర, నెల్లూరు, కడప, గోదావరి, తెలంగాణ యాసలు సినిమాల్లో అలా పొడచూపినవే. పైకి చూస్తే భాష ఒక్కటే అనిపిస్తుంది కానీ తెలంగాణ మాండలికం వేరు. అయితే తెలంగాణ యాస ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడింది. తమ భాషను కమెడియన్​కో, విలన్​కో పరిమితం చేస్తున్నారని, ఆ సొబగును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సింది పోయి అవమానిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇలా మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ సినిమా వాటా అంటే కేవలం ఇక్కడి యాస, భాషను కించపరచడమే వుండేది. కేవలం కమెడియన్లకు, విలన్లకు మాత్రమే తెలంగాణ యాసలో డైలాగులు, పాత్రలు డిజైన్ చేసేవారు. ‘శివ’ చిత్రంలో హోటల్ వెయిటర్ పాత్రలో ఉత్తేజ్, తెలంగాణ యాస మాట్లాడాడు. కోట శ్రీనివాసరావు చాలా పాత్రల్లో తెలంగాణ యాస అద్భుతంగా పలికించాడు. కానీ అవి విలన్ పాత్రలు. తనికెళ్ల భరణి కూడా తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడి కామెడీ పండించగలడు. తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీహరి తెలంగాణ యాసలో పదునైన మాటలు పలికాడు. అది కూడా హైదరాబాదీ రౌడీ పాత్రల్లోనే. ఇలా తొలి దశలో తెలంగాణ భాష నెగెటివ్ పాత్రలకే పరిమితమైంది. చాలా కాలం తర్వాత మార్పు మొదలైంది. తెలంగాణ వేషభాషలను ఇతర ప్రజలు అర్థం చేసుకోవడం. ప్రేమించడం మొదలు పెట్టారు. అది సినిమాల్లో ఇప్పుడు ట్రెండ్​గా మారింది. దాంతో నైజామ్‌‌ ప్రధాన మార్కెట్‌‌గా ఉన్న సినిమా పరిశ్రమ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. ఏకంగా హీరోలతోనే తెలంగాణ యాసను మాట్లాడించడం మొదలుపెట్టింది. ‘దెయ్యం’ సినిమాలో హీరోగా చేసిన జేడీ చక్రవర్తి, తెలంగాణ యాసలో మాట్లాడాడు. ‘రాజన్న’లో అక్కినేని నాగార్జున, ‘దూకుడు’లో మహేశ్‌‌బాబు, ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌‌, ‘జైబోలో తెలంగాణ’లో జగపతిబాబు, ‘వకీల్​ సాబ్​’లో పవన్ కల్యాణ్​... ఇలా టాప్ హీరోలు తెలంగాణ యాస పలికారు. దాంతో అప్పటిదాకా హీరోల లుక్ మీద దృష్టిపెట్టిన డైరెక్టర్స్... ప్రధాన పాత్రలు మాట్లాడాల్సిన యాసమీద కూడా దృష్టి పెట్టారు. తమకు పట్టున్న మాండలికాలను పెట్టి, తెరపై కొత్తగా పాత్రల్ని ఆవిష్కరించారు.
 తమ ఇంట్లో వాడే భాషను, తన స్నేహితులతో మాట్లాడుకునే భాషనే డైలాగ్స్​లో రాశారు. 

వరంగల్​కు చెందిన నిర్మాత రాజ్ కందుకూరి ‘పెళ్లి చూపులు’ సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా చిన్నచూపు చూసిన తెలంగాణ యాసకు గౌరవం కల్పించి ‘నేషనల్ అవార్డ్’ కూడా దక్కించుకుంది ఆ సినిమా. తెలంగాణ యాసలో ఉండే గొప్పదనాన్ని సినిమాలో చూపిన తీరుకు, ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అన్న ప్రాంతీయ బేధం లేకుండా తెలుగు ప్రేక్షకులు అంతా బ్రహ్మరథం పట్టారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘పెళ్లిచూపులు’ మూవీ 2016గాను జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డును గెలుచుకుంది. దాంతో పాటు ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ బెస్ట్ డైలాగ్​ రైటర్​గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అందులో ఉన్న మాటలన్నీ అచ్చ తెలంగాణ మాటలే.  ఇకపోతే దాని తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్​లో తెరకెక్కిన ‘‘ఫిదా”సినిమా. తెలంగాణ యాసకున్న ఆ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పకతప్పదు. ఫిదాలో సాయిపల్లవి తెలంగాణ యాసను ఆంధ్రా వాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేసారనటానికి అక్కడ ఫిదా సాధించిన కలెక్షన్సే సాక్ష్యం. 

నిజానికి శేఖర్ కమ్ముల అన్ని సినిమాల్లోనూ తెలంగాణ యాస కనిపిస్తుంది. మొదటి సినిమా ‘డాలర్ డ్రీమ్స్​’ నుంచి ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, మొన్న వచ్చిన ‘లవ్​ స్టోరీ’ వరకు అన్ని సినిమాల్లోనూ తెలంగాణ యాస, కల్చర్ కనిపించింది.ముఖ్యంగా ‘ఫిదా’ మాత్రం సాయిపల్లవి నిజామాబాద్‌‌ పోరిగా తెలంగాణ యాసలో మాట్లాడి, ప్రేక్షకుల్ని అలరించింది. ప్రేక్షకులకు నచ్చేలా కథ, కథనం ఉంటే ఏ యాసలో సినిమా చేసినా ఆడియెన్స్ వాళ్ల మనసుకు హత్తుకుంటారు అనే ధీమాను ఆ సినిమాలు బలపరిచాయి. ‘అర్జున్‌‌ రెడ్డి’ సినిమా అయితే తెలంగాణ భాషకి కమర్షియల్ హీరోయిజం అప్లై చేసింది. ఇదే కోవలో ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ తెలంగాణ భాషలో సినిమా ఆద్యంతం ‘‘తన మాటల’’తో అలరించి హిట్ కొట్టాడు. తమ చిత్రంలో ఉన్న స్పెషాలిటీని చెప్పాల్సిన టైంలో డైరెక్టర్స్​ భాష గురించి స్పెషల్​గా చెప్తున్నారంటే మస్తుంది తెలంగాణ సినిమా అనాల్సిందే. ‘మల్లేశం’ సినిమా తెలంగాణ నేత కార్మికుడైన చింతకింది మల్లేశం బయోపిక్​​. ఈ సినిమా హీరో ప్రియదర్శి, హీరోయిన్​ అనన్య నాగళ్ల కూడా తెలంగాణ వాళ్లే.

ఇంకొంతమంది..

బాబు మోహన్, వేణుమాధవ్.. కమెడియన్లుగా సినిమాల్లో తమ ముద్ర వేశారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, చమ్మక్​ చంద్ర.. వీళ్లంతా తమదైన గుర్తింపు తెచ్చుకుని అలరిస్తున్నారు. వీళ్లందరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర యాసలో కూడా చక్కగా డైలాగులు చెప్పగలరు. యాక్ట్రెస్​ల్లో బాపు డైరెక్షన్​లో ‘ముత్యాలముగ్గు’ సినిమాలో నటించిన సంగీత. ముత్యాల ముగ్గు సంగీతగా గుర్తింపు పొందారు. ‘లేడీ అమితాబ్​’గా ప్రేక్షకులతో పిలిపించుకున్న విజయశాంతి వరంగల్​లో పుట్టి చెన్నైలో పెరిగారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ‘కర్తవ్యం’,‘ప్రతిఘటన’, ‘ఒసేయ్ రాములమ్మ’  లాంటివి ఆమె సత్తా చాటాయి. ‘సమ్మోహనం’ సినిమాతో అందరినీ సమ్మోహన పరిచిన హైదరాబాద్​ అమ్మాయి అతిథి రావు హైదరి తెలంగాణ బిడ్డే. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసినా తమిళంలో మాత్రం బాగానే సత్తా చాటుతోంది ఆనంది. ‘తొలిప్రేమ’ హీరోయిన్​ కీర్తి రెడ్డి, రీసెంట్​గా వచ్చిన ‘నల్లమల’ సినిమాలో హీరోయిన్ భానుశ్రీ.. మొదలైన హీరోయిన్లంతా తెలంగాణ బిడ్డలే. 

పాటల రచయితలు డైరెక్టర్స్​, యాక్టర్సే కాదు పాటల రచయితలు కూడా చాలామంది ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. సి.నారాయణరెడ్డి, దాశరథి ఇద్దరూ పాటల రచయితగా గొప్ప స్థాయికి చేరుకున్నారు. జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన చందాల కేశవదాసు తొలి తెలుగు టాకీ చిత్రమయిన భక్త ప్రహ్లాదకు సంభాషణలు, పద్యాలు రాశారు. శ్రీకృష్ణ తులాభారంలోని ‘‘భలేమంచి చౌక బేరము’’ ఈ రచయిత రాసిందే. తెలుగునాట నాటక ప్రదర్శనకు ముందుగా పాడే ‘పర బ్రహ్మ పరమేశ్వర’ గీతం కూడా చందాల కేశవదాసు రాసిందే. పైన పేర్కొన్న ప్రతి సినిమాకూ తెలంగాణ ముద్ర ఉంది.  ఈమధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలో కొందరు తెలంగాణవాళ్లు నిలదొక్కుకుంటున్నారని చెప్పవచ్చు. చంద్రబోస్‌‌, సుద్దాల అశోక్‌‌ తేజ, కాసర్ల శ్యామ్‌‌, వరికుప్పల యాదగిరి, ఈమధ్య గతించిన కందికొండ వంటివాళ్లు పాటల రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దివంగతులైన చక్రి మంచి సంగీత దర్శకుడుగా పేరు పొందారు. తెలుగు సినిమా రంగం ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించే దిశగా కళ్లు తెరుస్తోంది. 

సింగర్స్

కరీంనగర్​కు చెందిన సింగర్ మౌనిక ‘పుష్ప’ సినిమాలో ‘సామి సామి’ అనే పాటతో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళని స్టెప్పులు వేయించింది. గోదావరిఖనికి చెందిన సింగర్ మధుప్రియ చిన్నతనంలోనే ‘ఆడపిల్లనమ్మా నేను ఆడ పిల్లనని’ అనే పాటతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో పాడి తన సత్తా చాటింది. ‘ఫిదా’ సినిమాలో ‘వచ్చిండే...’ పాటతో ఉర్రూతలూగించింది. రాహుల్ సిప్లిగంజ్.. జానపద పాటలకు ఫేమస్ ఈ పేరు. తనే పాటలు రాసి, పాడే పాప్ సింగర్. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో పాపులర్​ అయిన రాహుల్, 2009లో వచ్చిన ‘జోష్’ సినిమాలోని ‘కాలేజ్ బుల్లోడా’ పాట సినిమాల్లో ఆయన పాడిన మొదటి పాట. ఆ తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ త్రీ’ లో విన్నర్​గా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమయ్యాడు. ‘జాతి రత్నాలు’ సినిమాలో టైటిల్ సాంగ్ ‘సూడు సూడు’ పాటలతో ఆకట్టుకున్నాడు. లేటెస్ట్​గా ‘ఆర్ ఆర్​ ఆర్​’ సినిమాలో ‘నాటు నాటు’ పాట పాడాడు. కామారెడ్డి యువకుడు అనురాగ్ కులకర్ణి ప్లే బ్యాక్​ సింగర్​గా నిలదొక్కుకున్నాడు. ‘అలవైకుంఠపురములో’ అతను పాడిన ‘రాములో రాములా’ పెద్ద హిట్​.‘రోల్ రైడా’గా ఫేమస్ అయిన రాహుల్ కుమార్ వేల్పుల.. తెలుగులో మంచి ర్యాపర్. పాటల రచయిత కూడా. ప్రెజెంట్ సినిమాల్లోనూ పాడుతున్నాడు.కోమండూరి రామాచారి.. సంగీత అధ్యాపకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. హైదరాబాదులో అతను నిర్వహిస్తున్న లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ (ఎల్. ఎం. ఎ) ద్వారా ఎంతోమంది పిల్లలు సంగీతం నేర్చుకుని సినిమా రంగంలో ప్రవేశించారు. హేమచంద్ర, కారుణ్య లాంటి గాయకులు రామాచారి దగ్గర సంగీతం నేర్చుకున్న వారే. 

దక్కన్ వుడ్
హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని తెలుసు. మరి ఈ దక్కన్‌‌వుడ్ ఏంటీ ? దక్కన్ పీఠభూమిలో ఉన్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్రమే ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంగా పిలువబడేది. ఇక్కడ మాట్లాడే భాష లేదా యాసనే ‘దక్కనీ భాష’గా పిలుస్తారు. అది తెలుగు (తెలంగాణ) భాషనే కావచ్చు, హిందీ లేదా ఉర్దూనే కావచ్చు. ఇప్పుడు ఈ దక్కని భాషలో సినిమాలు రావాలి అని ఇక్కడి వారు కోరుకుంటున్నారు. ఆమధ్య ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రాలో స్టూడియోల నిర్మాణానికి సాయం చేస్తామని ఓపెన్​గానే చెప్పారు. ఈ పరిస్థితిలో పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్తే దీంతో టాలీవుడ్‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ‘దక్కన్‌‌వుడ్’ రాబోతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది.

నిజానికి హైదరాబాదీ జీవనశైలి, తెలంగాణ- ఉర్దూల పునాదులపై మొదట నగేష్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’(1998) సినిమా దక్కనీ ఫిలిమ్​కి దారి చూపించింది. కేవలం పదిహేడు రోజుల్లో 17 లక్షలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా తెలుగులోనే కాక మొత్తం భారత సినీ రంగంలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్ మూవ్‌‌మెంట్‌‌కు, ‘క్రాసోవర్ సినిమా స్టయిల్’కు ద్వారాలు తెరిచింది. ‘హింగ్లిష్’ సినిమాలుగా పేరు పొందిన ఈ సినిమా మళ్లీ 2002 నుంచి సరికొత్తగా పూర్తి ఉర్దూ- తెలంగాణ నేపథ్యంలో సరదా కథాంశాలతో హైదరాబాదీ సినిమాగా నిలదొక్కుకుంది. ‘అంగ్రేజ్’ సినిమాతో మొదలైన ఈ ధోరణి ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘జబర్‌‌దస్త్’ వంటి సినిమాలతో ఊపందుకుంది.

అవార్డు సినిమా 
తెలుగు సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్‌‌టైనర్స్ గా అలరిస్తున్న సమయంలో తెలంగాణ సినిమా మాత్రం ఏనాడో సరిహద్దులు దాటేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ఏమైనా పేరు, గుర్తింపు వచ్చిందంటే అది ముఖ్యంగా తెలంగాణ సినిమా వల్లనే అని చెప్పాలి. ఇప్పటి వరకూ వచ్చిన తెలంగాణ సినిమాలు సంఖ్యాపరంగా 100కు లోపే ఉండొచ్చు. కానీ క్వాలిటీ, సినిమా ఆర్ట్ పరంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఒకటున్నదనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది తెలంగాణ సినిమానే. అయితే తెలుగు సినిమా ఖ్యాతి గురించి చెప్పాల్సిన ప్రతిసారీ.. ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ వంటి సినిమాల గురించే మాట్లాడతారు. కానీ ‘మా భూమి’ గురించో, ‘దాసి’ గురించో మాట్లాడరు. ఆ మాటకొస్తే అసలు ఈ సినిమాల ఉనికినే గుర్తించరు. గుర్తించే అవకాశాన్ని కూడా ప్రేక్షకులకు రాతల్లో కానీ, వేదికల మీద కానీ ఇవ్వరు. మనకన్నా వెనకబడిన సినిమా ఇండోనేషియా సినిమా. ఆ దేశ రాజధాని జకార్తాలో జరిగిన ఫిలింఫెస్టివల్లో ‘నర్తనశాల’ సినిమాను మెచ్చుకున్నారని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం. కానీ ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్స్’లో అవార్డులను, ప్రశంసలను సాధించిన ‘దాసి’, ‘మట్టి మనుషులు’ గురించి మర్చిపోతున్నారు. జాతీయస్థాయిలో ఐదు అవార్డులు అందుకున్న ఒకే ఒక్క తెలుగు సినిమా ‘‘దాసి’’.

తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ
చలన చిత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రంలో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాల్సిందిగా దేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది కాలానికే డైరెక్టర్ వి. శాంతారాం గవర్నమెంట్​కి విన్నవించారు. అయితే నేటికీ అది జరగలేదు. సినిమాలు ఇప్పటికీ కేంద్రంలో ఇన్​ఫర్మేషన్​ అండ్ బ్రాడ్ కాస్టింగ్​ మినిస్ట్రీలో భాగంగానే ఉంటున్నాయి. హైదరాబాద్‌‌లో తెలుగు సినీ ఇండస్ట్రీ వేళ్లూనుకున్నాక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఓ భాగంగా ఉంటూ వచ్చిన ఆ శాఖ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో భాగమైంది. సినీ  ఇండస్ట్రీలోని సమస్యల్ని, అక్కడి పరిస్థితుల్ని అర్థంచేసుకొని ఇండస్ట్రీని నడిపిస్తూ, అవసరమైన సాయం చేయడం ఈ మంత్రిత్వ శాఖ ఉద్దేశంగా ఉండాలి. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక చాలాసార్లు సినిమాటోగ్రఫీ తెలంగాణ సినిమా రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని తెలంగాణ సినిమా రూపకర్తలు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా ఆ వైపుగా అడుగు ముందుకు పడలేదు. గవర్నమెంట్ ఉదారంగా ముందుకు వచ్చి పనిచెయ్యకపోతే తెలంగాణ సినీ ఇండస్ట్రీ అనేది వేళ్లూనుకోవడంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. 

తెలంగాణ సినిమాల అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాతలు, నటులు, కళాకారుల రక్షణ కోసం ఇపుడు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌‌లు అలాంటివే. వీటి కృషితో ‘తెలంగాణ సినిమా’ రాబోయే కాలంలో ఆర్గనైజ్డ్​గా ఉండే అవకాశాలున్నాయి. మార్కెట్‌‌పరంగా ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న తెలంగాణ నైజాం ఏరియాలో కొత్తరకం సినిమాలకు కూడా మంచి అవకాశం ఉంది. 
అలాగే, తెలంగాణ ప్రొడ్యూసర్లకు గవర్నమెంట్ సబ్బిడీలు, రాయితీలు ఇస్తే తెలంగాణ ప్రొడ్యూసర్లలో పెట్టుబడి శక్తి తక్కువగా ఉన్నందున చిన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా వచ్చే అవకాశం లేకపోలేదు. 

ఆర్ట్​ ఫిల్మ్ లెజెండ్

తెలుగు సినిమాల్లో తెలంగాణదనం చూపించి, ఇంటర్నేషన్​ అవార్డులు అందుకున్న లెజెండరీ డైరెక్టర్​ బి. నరసింగరావు. ప్రజెంట్ సినిమాల్లో తెలంగాణదనం గురించి ఏమంటున్నారంటే.. ‘మల్లేశం’ సినిమాలో తెలంగాణ కల్చర్ కనిపించింది. కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటివి చేశారు. అర్జున్​ రెడ్డి సినిమాటోగ్రఫీ, స్ర్కిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ డైరెక్షన్​ అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత ‘మల్లేశం’ తప్పించి, తెలంగాణ కల్చర్​ ఉన్న సినిమాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాలేదు అనేది నా ఫీలింగ్. నేను చేసింది ఎనభై, తొంభైల్లో. నాకెందుకు ఆ ఇంట్రెస్ట్ ఉందంటే.. నేను1970 నుంచి నాటక రంగంలో పనిచేశాను. నాటకాలన్నీ రైతులు, కూలీలు వంటి గ్రామీణ కల్చర్​తో సహజంగా ఉండేవి అప్పట్లో. అందుకని నేచురల్​గా ఉండే ఎమోషన్స్, కల్చర్, భాష వంటి అంశాలే నచ్చుతాయి నాకు. అందుకే నా సినిమాల్లో కూడా అవే చూపిస్తా. ‘మా భూమి’ సినిమా చూస్తే.. అందులో ‘ఇది తెలంగాణ గడ్డ’ అనే వాయిస్​ ఓవర్​తో మొదలవుతుంది. ‘రంగుల కల’,  ‘దాసి’, ‘మట్టి మనుషులు’ ఇవన్నీ చేశాను. ఆ తర్వాత వేరే డిపార్ట్​మెంట్​లలో కూడా పని చేశాను. అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఐదు నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమా ‘దాసి’. అంతేకాకుండా ముప్పై, నలభై ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్​కి వెళ్లింది. వందేండ్ల తెలుగు సినిమా చరిత్రలో ‘మ్యూజియం మోడర్న్​ ఆర్ట్’ థియేటర్లో ‘దాసి’ సినిమా వేస్తే, నా ఫ్యామిలీతో కలిసి చూశా. ఆ తర్వాత ఇప్పటి వరకు అందులో మళ్లీ మరో తెలుగు సినిమా కనిపించలేదు. మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్​లో ఇండియాని నేను రిప్రజెంట్ చేశా. ఒకటి దాసి, రెండోది మట్టి మనుషులు. నేషనల్, ఇంటర్నేషనల్ జ్యూరీల్లో నేను పని చేశాను. తెలుగు సినిమా నామినేషన్​కి వచ్చిన ప్రతిసారీ నేను రిఫర్ చేసేవాడ్ని. కానీ, వాళ్లు ఒప్పుకోరు. ఎందుకంటే వాటికి అంత క్వాలిటీ లేదని పక్కన పెట్టేవాళ్లు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో భాష, యాస పెట్టేది కమర్షియల్ హిట్ కోసమే. ఒక భాష వాడేటప్పుడు సరైన బ్యాక్​ డ్రాప్, సెట్ ప్రాపర్టీలు వంటి అన్ని అంశాలు ఉండాలి. లేదంటే అవి సహజత్వానికి దూరంగా ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో నేచురాలిటీ కంటే కల్పితమే ఎక్కువ. ఏదో పైపైన చూపిస్తారు. కానీ, రియలిస్టిక్​గా ఉండాలి. నేచురల్​గా తీయాలనే తపన వాళ్లలో ఉండదు. గవర్నమెంట్ హెల్ప్ చేస్తే కచ్చితంగా తెలంగాణ కల్చర్ చూపించే క్వాలిటీ ఉన్న ఆర్ట్ ఫిల్మ్స్​ తీయడానికి అవకాశం ఉంది. ప్యాండెమిక్ వల్ల ఆగాను. మళ్లీ కొత్త ప్రాజెక్ట్​లు చేయబోతున్నా. కాకపోతే నేను తీసేవన్నీ నా సొంత ఇంట్రెస్ట్​తో తీస్తాను.

తెలంగాణ హీరోయిజం

కళకు ప్రాంతంతో సంబంధం లేదు. కళాకారుడు ఏ ప్రాంతం వారైనా ప్రజలంతా అతన్ని తమవాడిగా చేసుకుంటారు. అలా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో నితిన్. ఇప్పుడు అదే కోవలో  విజయ్ దేవరకొండ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  తెలంగాణ మెగాస్టార్ అంటూ విజయ్ దేవరకొండ గురించి కామెంట్ చేయడాన్ని బట్టే మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో తెలంగాణ హీరోల హవా ఎలా సాగుతోందో చెప్పొచ్చు. ‘హ్యాపీ డేస్’తో గుర్తింపు సాధించి... ‘స్వామి రారా’, ‘కేశవ’ లాంటి రీసెంట్ హిట్స్ తో నిఖిల్ తనకంటూ స్పేస్ ఏర్పరుచుకున్నాడు. అలాగే కార్తికేయ,  విశ్వక్ సేన్​ తెలంగాణ పోరలుగా తమ సత్తా చూపిస్తున్నారు. మరో వైపు నవ్వించే హీరోగా సంపూర్ణేష్ బాబు ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే, తెలుగు సినిమాల్లో తెలంగాణ నుంచి రావాల్సింది ఇంకా చాలా ఉంది.

స్టార్​ ప్రొడ్యూసర్

తెలుగు సినిమాల్లో మంచి అభిరుచి కలిగిన, మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన అసలు పేరు వి. వెంకట రమణా రెడ్డి. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో సక్సెస్​ అయ్యాక 1999లో  ‘శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్’ అనే ప్రొడక్షన్​ కంపెనీ స్థాపించారు. 2002లో ‘దిల్’ సినిమాతో మొదలుపెట్టాడు. ఆ సినిమా మంచి రిజల్ట్ ఇచ్చింది. దాంతో దిల్ అనేది ఆయన ఇంటి పేరు అయిపోయింది.  ఆ తర్వాత ఆర్య, బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి మైలురాళ్లు ఉన్నాయి ఆయన తీసిన సినిమాల్లో. ‘ఫిదా’ చిత్రంతో తెలంగాణ భాష, సంస్కృతి సొగసును ప్రేక్షకులకు చూపించారు. ‘మహర్షి’ లాంటి సినిమాతో జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్​ చేసి కొత్త ఒరవడికి నాంది పలికాడు దిల్ రాజు. చాలామంది కొత్త దర్శకులను, నటీనటులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు. ఆయన ఎగ్జిబిటర్ కూడా. ‘ఎఫ్ త్రీ’తో 50 నిర్మాతగా సినిమాలు పూర్తి చేశారు దిల్ రాజు. 

ఆల్రెడీ ట్రెండ్ సెట్ చేసింది
వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూపించాలనేది నా ప్రయత్నం. అందుకే నా సినిమాల్లో తెలంగాణ కల్చర్​ కనిపిస్తుంది. నా మొదటి సినిమా ‘డాలర్ డ్రీమ్స్’​ నుంచి తెలంగాణ యాస, కల్చర్​ చూపిస్తూనే ఉన్నా. ‘ఫిదా’ మాత్రం తెలంగాణ యాస, కల్చర్​ని పూర్తిగా చూపించాలనే ఉద్దేశంతోనే తీశా. ఇప్పుడు చాలావరకు మారిపోయింది. తెలంగాణ అనేకాకుండా ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలో మాట్లాడే భాష, యాస, వాళ్ల కల్చర్​ని చూపిస్తున్నారు. అది మంచి మార్పు. ఆల్రెడీ తెలంగాణ కల్చర్ ట్రెండ్ సెట్ చేసింది. ఒక్కో భాష, యాసకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అదే మన గొప్పతనం.​ అప్పట్లో కూడా కామెడీగానే చూపించాలనే ఉద్దేశంతో సినిమాల్లో పెట్టలేదు. అదొక ట్రెండ్​లాగా నడిచింది అంతే. సీరియస్​గా చూపించాలి అనే ఆలోచన చేయలేదేమో బహుశా. కానీ, తెలంగాణ ఇప్పుడు అలా కాదు.. మొత్తం మారిపోయింది. ఇప్పుడు పది సినిమాలు రిలీజ్​ అయితే వాటిలో వాళ్ల ప్రాంతీయతను చూపించే సినిమాలే ఎక్కువ. 
- డైరెక్టర్ శేఖర్​​ కమ్ముల::: చరణ్ పరిమి