
చిల్లకూరును చిన్నరాయుడు పాలించేవాడు. దాని పక్కనే ఉన్న పాలకొల్లుని పాలకొండరాయుడు పాలించేవాడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తమ తండ్రుల వారసత్వ ఫలితంగా రాజ్య పాలనా బాధ్యతలు చేపట్టారు. చిన్ననాటి స్నేహం కారణంగా పాలనలో పరస్పర సహకారం అందించుకునేవారు.
ఓ సారి చిల్లకూరును వింతజబ్బు పట్టి పీడించింది. ఫలితంగా ఆ రాజ్య ప్రజలు చనిపోసాగారు. ఇది చిన్నరాయుడి మదిని తీవ్రంగా కలచివేసింది. అదంతా చూస్తున్న పాలకొండరాయుడు సైతం భయపడ్డాడు. ఓ రాత్రంతా మేల్కొని తీవ్రంగా ఆలోచించి తనవైద్యులను ఆ రాజ్యానికి పంపి జబ్బుకు కారణమేమిటో కనుక్కోవాలని ఆదేశించాడు.
వైద్యబృందం చిల్లకూరును చేరుకుంది. మనుషులందరినీ గమనించిన వారు విస్తుపోయారు. ఎవరిని పలుకరించినా ‘‘మా రాజు ఏమీ తెలియని అమాయకుడు.. బతకడమే చేతకాదు.. ఇక మమ్మల్ని ఎలా బతకనిస్తాడు?’’ అని ఏకరువు పెట్టసాగారు.
‘‘ మారాజు బంగారం పిచ్చోడు. ప్రజలందరూ ఎంత ఎక్కువ బంగారం కలిగి ఉంటే అంత ఎక్కువ తన రాజ్యాన్ని మెచ్చుకుంటారని కుబేర రాజ్యంగా గుర్తించి గౌరవిస్తారని భావిస్తాడు. ఆయన చెప్పినట్లే మేమంతా ఉన్న డబ్బంతా వెచ్చించి బంగారం కొని దాచుకున్నాం..’’ కనీసం తినడానికి కూడా డబ్బులేదు. ఇంట్లో బంగారం ఉంటే దొంగలు వచ్చి ఇళ్లమీద పడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న మాకు భయం పట్టుకుంది. దిగులుతో మంచం పట్టి చనిపోతున్నారు’’ అని వాపోయారు ప్రజలు.
అది విన్న వైద్యులు ప్రజలను పరీక్షించి నిజంగా వారికి ఏ జబ్బూ లేదని రాజును పట్టిపీడిస్తున్న బంగారం జబ్బే అందరినీ పీడిస్తోంది’’ అని తేల్చారు. వెళ్లి పాలకొండరాయుడుకి తమ నివేదికను సమర్పించారు వైద్యులు.అది విన్న పాలకొండరాయుడికి జాలేసింది. చిన్నరాయుడి దగ్గరకు వెళ్లి దిగులుతో మంచం పట్టిన మిత్రుడిని పరామర్శించాడు.
ఇది తెలిసిన ఇరుగుపొరుగు రాజులు పాలకొండరాయుడితో ‘‘ఆ రాజ్యలో బంగారం బాగా ఉంది.. నువ్వు మాతో కలిసి వస్తే ఆ రాజ్యాన్ని కబళించి సగం పంచి ఇస్తాం.. అప్పుడు సంపన్నులు కావచ్చు ’’ అని ఆశ కల్పించారు.ఇది విన్న పాలకొండరాయుడికి ఇరుగుపొరుగు రాజుల మాటల్ని తిప్పికొట్టి స్నేహితుడి రాజ్యం అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా వీరోచితంగా పోరాడి విజయం సాధించాడు. మంచం పట్టిన చిన్నరాయుడి దగ్గరకు వెళ్లి ‘‘మిత్రమా..’’ అని పలుకరించాడు. ఆవేదనతో మిత్రుడి మాట విని కళ్లు తెరిచి చూశాడు చిన్నరాయుడు.
►ALSO READ | చాణక్య రాజనీతి : ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సిందే..!
‘‘మిత్రమా నా రాజ్యానికి తెలియని జబ్బు పట్టింది. ఏ వైద్యం చేయాలో తెలియడం లేదు! ఇలా జబ్బుపట్టి నేను ఏడుస్తుంటే చుట్టుపక్కల రాజులు నాపైకి దండెత్తి వచ్చి కష్టాలు తెచ్చిపెడుతున్నారు. నీకు వీలైతే మంచి వైద్యం చేయించి చక్కదిద్దు’’ అని చేతులు జోడించాడు.
మిత్రుడి అనాలోచిత మాటలకు పాలకొండరాయుడు నివ్వెరపోయి ‘‘మిత్రమా.. నీ రాజ్యానికి ఏ జబ్బూ లేదు. ఇప్పటికే మా వైద్యులు తేల్చారు’’ అనడంతో మంచం పై నుంచి లేచి కూర్చున్నాడు చిన్నరాయుడు.
ఆ తర్వాత తన రాజ్యాన్ని పీడిస్తున్నది బంగారం జబ్బే అని గ్రహించాడు చిల్లకూరు రాజు. పరిస్థితి చక్కదిద్ది మిత్రుడి సలహాలు, సూచనలు, సహకారంతో బంగారం జబ్బును తొలగించుకుని రాజ్యాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి ప్రజల మన్ననలు పొందాడు చిల్లకూరు రాజు చిన్నరాయుడు.