చాణక్య రాజనీతి : ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సిందే..!

చాణక్య రాజనీతి : ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సిందే..!

చాణక్యుడు అనగానే అందరికీ అర్థశాస్త్రం స్ఫురణకు వస్తుంది. దానితో పాటు ఆయన రాజనీతిని బోధపరిచాడు. చంద్రగుప్తుడి వద్ద మంత్రిగా పనిచేసిన చాణక్యుడు... రాజు/పరిపాలకుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలిపాడు. చాణక్యుని రాజనీతి సర్వదా అనుసరణీయం.

‘రాజు/పరిపాలకుడు.. ఒక రోజులోని రాత్రి, పగలు భాగాలను విభజించుకుని, ఏయే సమయంలో ఏ పని చేయాలో, ఆయా సమయాలలో ఒక ప్రణాళిక ప్రకారం పని చేయాలి. కాల నియమం ప్రకారం పనులు చేయకపోతే, పనులన్నీ వాయిదా పడి, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజాదర్బారులోకి అడుగు పెట్టిన తర్వాత.. తనతో పని ఉండి వచ్చినవారికీ న్యాయం చేయాలి. ద్వారం దగ్గర ఎటువంటి ఆటంకం లేకుండా వారిని లోపలికి రానివ్వాలి. తనతో పని ఉన్నవాళ్లకి రాజు దర్శనం ఇవ్వకపోవడం వల్ల... పరివారంలో ఉన్నవారంతా.. చేయదగిన పనులు, చేయదగని పనులు తారుమారు చేసేస్తారు. దానితో రాజు ప్రజల తిరుగుబాటుకు గురి అవుతాడు. అందుచేత దేవాలయాలు, ఆశ్రమాలు, పాషండుల స్థానాలు, శ్రోత్రియుల స్థానాలు, పశుస్థానాలు, పుణ్యస్థానాలు వీటికి సంబంధిత కార్యాలను.. ఇంకా... బాలలు, వృద్ధులు, రోగగ్రస్తులు, కష్టాలలో ఉన్నవాళ్లు, అనాథలు, స్త్రీలు.. వీరి పనులను వరుసగా చూసుకుంటూ రావాలి. ఒక పనికి ఉన్న గౌరవాన్ని, ప్రాధాన్యాన్ని బట్టి ఆ పనిని త్వరగా పూర్తి చేయాలి.

సర్వమాత్యయికం కార్యం శృణుయాన్నాతిపాతయేత్‌‌‌‌‌‌‌‌ 
కృచ్రసాధ్యమతిక్రాన్తమసాధ్యం వా విజయతే 

తొందరగా చేయవలసిన కార్యాన్ని వెంటనే వినాలి. దాటవెయ్యకూడదు. అలా దాటవేస్తే, ఆ పని అతి కష్టం మీద పూర్తవుతుంది. ఒక్కోసారి పూర్తి కాకపోవడానికి కూడా అవకాశం ఉంది. 

తపస్వినాం తు కార్యాణి జైవిధైః సహ కారయేత్‌‌‌‌‌‌‌‌  మాయాయోగవిదాం చైవ న స్వయం కోపకారణాత్‌‌‌‌‌‌‌‌ 
మునుల పనులు, మాయాప్రయోగం తెలిసిన వాళ్ల పనుల విషయంలో..  మూడు వేదాలలో పండితులైన వారిని సంప్రదించి వారి చేత చేయించాలి. రాజు ఒక్కడే ఒంటరిగా చేయకూడదు. ఎందుకంటే.. ఏదైనా పొరపాటు జరిగితే వాళ్లకు కోపం రావచ్చు. అలా వారికి కోపం రావడం రాజుకు మంచిది కాదు. ఈ విషయాన్ని పరిపాలకుడు సర్వదా గుర్తుంచుకోవాలి. 

నిరంతరం జాగరూకతతో ఉండటం రాజుకి పవిత్రమైన వ్రతం వంటిది. ప్రజలందరి విషయంలోను పరిపాలకుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఏ రోజైతే రాజ్యాభిషిక్తుడవుతాడో.. నాటి నుండి ప్రజాపాలన అనే యజ్ఞానికి దీక్ష వహించినట్లు అని అర్థం.

ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉంది. ప్రజల హితంలోనే రాజు హితం ఉంది. ప్రజలకు ఏది ప్రియమో అదే తన హితం. ఆ విధంగా రాజు నిత్యం ఉద్యమశీలుడై  కార్యనిర్వహణ చేపట్టాలి. ప్రయత్నం చేస్తున్నంతవరకు ఫలితం లభిస్తూనే ఉంటుంది. కార్యసంపదను కూడా పొందుతాడు’ అని వివరించాడు చాణక్యుడు.రాముడి పరిపాలన పరిశీలిస్తే... ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అందువల్లే రామరాజ్యం అనే పేరుతో నిలబడిపోయాడు రాముడు. 

మహాభారతంలో పాండవులు సైతం రాజధర్మాన్ని అనుసరించే పరిపాలించారు. నిరంతరం మంత్రుల ద్వారా పరిపాలనా విధానాన్ని తెలుసుకుంటూ, వారి మాటలను అనుసరిస్తూ, ప్రజలందరికీ న్యాయం చేశారు. ముఖ్యంగా ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, ఆ యాగానికి అనుసరించవలసిన విధులన్నీ అనుసరించాడు. సోదరుల సహకారంతో యాగాన్ని పరిపూర్ణం చేశాడు. వచ్చినవారందరికీ వెలకట్టలేని సంపదలను దానాలుగా ఇచ్చాడు. ప్రజలు వచ్చి ఇబ్బందులు చెప్పుకోవలసిన అవసరం లేకుండా పరిపాలించాడు. పరిపాలనా దక్షత గల ఇటువంటి రాజులు కొద్దిమంది మాత్రమే ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. గుప్తులు, శ్రీకృష్ణదేవరాయలు, శాతవాహనులు.. వంటివారు. 

చెప్పుడు మాటల వల్ల రాజుల మధ్య వైరం ఏర్పడి యుద్ధాలు జరిగినట్లుగా పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం గాథలు మనకు చెబుతున్నాయి. ఆంగ్లేయులకు సైతం సహకరించి, మన రాజులకు ద్రోహం తలపెట్టారు.
అందువల్లే... సలహాలను ఇచ్చే మంత్రులను కూడా జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాలంటాడు చాణక్యుడు.

- డా. పురాణపండ వైజయంతి-