సాలూర చెక్​పోస్టులో ఏసీబీ అధికారుల దాడులు

సాలూర చెక్​పోస్టులో ఏసీబీ అధికారుల దాడులు
  • కంప్యూటర్​ ఆపరేటర్​ వద్ద  రూ.13,590లు స్వాధీనం

బోధన్​, వెలుగు: తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర  రవాణాశాఖ చెక్ పోస్టులో నిజామాబాద్​ ఏసీబీ డీఎస్సీ శేఖర్​ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.  ఏసీబీ అధికారుల  బృందం సభ్యులు ముందస్తుగా ఆఫీసులోకి వెళ్లకుండా నిఘాపెట్టి రవాణాశాఖ పరిసర ప్రాంతాలను గమనించారు. చెక్​పోస్టు ముందు నుంచి వాహన  డ్రైవర్లు కొంతమంది పర్మిట్లు తీసుకొని వెళుతుండగా, మరి కొంతమంది డ్రైవర్లు ఆఫీసులోని టేబుల్​పై డబ్బులు పెట్టి వెళ్లిపోవడం గమనించారు. 

అనంతరం ఏసీబీ  డీఎస్పీతో పాటుగా మరో ముగ్గురు సీఐలు ఆఫీసులోకి  ప్రవేశించి తనిఖీలు చేపట్టారు.  ఆఫీసులో  హెడ్ కానిస్టేబుల్,  కంప్యూటర్​ ఆపరేటర్​ ఇద్దరు మాత్రమే  ఉన్నారు. మంగళవారం డ్యూటీలో ఉండాల్సిన ఎంవీఐ (మోటర్ వెహికిల్​ ఇన్స్పెక్టర్​) శ్రీకాంత్​  డ్యూటీలోకి రాకపోవడంతో అతనికి డీఎస్పీ ఫోన్​ చేసి రప్పించారు.  ఆఫీసులో తనిఖీలు చేపట్టగా కంప్యూటర్​ ఆపరేటర్​ వద్ద రూ.13,590 పట్టుకున్నారు. ఆఫీసులోని  రికార్డులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్​ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర  వ్యాప్తంగా ఏకకాలంలో రవాణా శాఖ   చెక్​పోస్టుల్లో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

రవాణా శాఖ చెక్​పోస్టుల్లో  కొన్ని నెలల నుంచి  వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనీఖీలు చేపట్టినట్లు తెలిపారు.  పట్టుకున్న డబ్బులు సీజ్​ చేసినట్లు చెప్పారు.  ఉన్నతాధికారుల  ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో  ఏసీడీ డీఎస్పీ  శేఖర్​తో పాటుగా సీఐలు నగేశ్​, శ్రీనివాస్​, వేణు, సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.