
ములకలపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లముడి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న అక్షరలొద్ది గుట్టలను ఆదివారం తెలంగాణ బిర్సాముండా రీసెర్చ్ సెంటర్ బృందం పరిశీలించింది. గుట్టలపై ఉన్న లిపిని పరిశీలించిన నిపుణులు ఆదివాసీ సమాజంలోని 3వ గొట్టు పూర్వీకులు వారి మూలాలను ముందు తరాలకు అందించటానికి వేసిన లిపిగా నిర్ధారించారు. ఇసుక రాయి గుణం కలిగిన ఈ బండరాళ్లు 30 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల ఎత్తులో ఉన్నాయని పరిశోధన బృందం గుర్తించింది. 3వ గొట్టు తొలి మానవులు వేసిన బొమ్మలు ఈ రాతి చిత్రాల్లో ఉన్నాయని తెలిపారు.
ఆదివాసీల దైవాలు కొమరంవారి వేల్పు రెక్కల రామక్క, కాకి పోలుగ గుర్తు, ఉడుం గుర్తు, రేలపాటల నృత్యాలు, కోయల పెళ్లి సందర్భంలో పల్లకీలో మోసే చిత్రలిపి, గుర్రంపై రాజులు, పీటముగ్గు, ఇప్ప చెట్ల మూలంతో పాటు పలు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ రాతి చిత్రాలపై త్వరలో ఒక పుస్తకం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరిశోధనలో బిర్సాముండా రీసెర్చ్ సెంటర్ బృందం సభ్యులు ఆలం వెంకట్, మైపతి చరణ్, కోయ పెద్దల సంఘం రాష్ట్ర కన్వీనర్ మైపతి హన్మంతరావు, తెలుగు యూనివర్శిటీ భాషా శాస్త్రం స్టూడెంట్కాక నవ్య, చరిత్ర స్టూడెంట్కాక శ్వేత పాల్గొన్నారు.