మూడేండ్ల చిన్నారి బతుకు పోరాటం..పుట్టుకతోనే మలద్వారం, ఎడమ కిడ్నీ లేక... పొట్ట నుంచే మల, మూత్ర విసర్జన

మూడేండ్ల చిన్నారి బతుకు పోరాటం..పుట్టుకతోనే మలద్వారం, ఎడమ కిడ్నీ లేక... పొట్ట నుంచే మల, మూత్ర విసర్జన
  • కడుపుకు మెడికల్​ బ్యాగ్ ఏర్పాటు..  మూత్రం పోస్తే నరకమే..
  • ఆపరేషన్ ​కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు  
  • ఆగస్టు 3న కోయంబత్తూరు పీఎస్‌‌‌‌‌‌‌‌జీ ఆసుపత్రిలో మేజర్ సర్జరీ చేయాల్సి ఉంది
  • ఆర్థిక స్థోమత లేని ర్యాపిడో నడిపే తండ్రి.. ఆపన్నహస్తం కోసం వేడుకోలు

హైదరాబాద్, వెలుగు: పుట్టుకతోనే వచ్చిన అరుదైన వైకల్యాలతో మూడేండ్ల చిన్నారి దేవాశిష్‌‌‌‌‌‌‌‌ నరకయాతన అనుభవిస్తున్నాడు. మలద్వారం లేకపోవడం, ఎడమ కిడ్నీ లేకపోవడం, మూత్రనాళం చీలిపోవడం వంటి సమస్యలతో ఆ చిన్నారి జీవితం కష్టంగా మారింది. రోజూ పొట్టకు మెడికల్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ కట్టుకుని బతుకుతున్న దేవాశిష్‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం పెద్ద ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ అవసరం ఉంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, కవిత దంపతుల కుమారుడు దేవాశిష్‌‌‌‌‌‌‌‌ పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 

బిడ్డకు మలద్వారం సరిగా లేకపోవడంతో పాటు మూత్రనాళం వై ఆకారంలో రెండుగా చీలిపోయింది. ఎడమ వైపు కిడ్నీ పుట్టుకతోనే లేకపోవడం, ఎడమ వృషణం కిందికి దిగకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో పుట్టిన మరుసటి రోజే డాక్టర్లు ఆపరేషన్ చేసి పొట్టకు రంధ్రం చేసి మల, మూత్ర విసర్జన జరిగేలా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మూడేండ్లుగా దేవాశిష్‌‌‌‌‌‌‌‌ పొట్టకు మెడికల్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ కట్టుకుని జీవిస్తున్నాడు.  

మూత్రం పోసినప్పుడల్లా నొప్పి..

మూత్రనాళ సమస్య వల్ల మూత్రం పోసిన ప్రతిసారీ దేవాశిష్‌‌‌‌‌‌‌‌ తీవ్ర నొప్పితో ఏడుస్తుంటాడు. బిడ్డ పడుతున్న బాధను చూసి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ సమస్యను సరిచేసేందుకు ఆగస్టు 3న కోయంబత్తూరులోని పీఎస్‌‌‌‌‌‌‌‌జీ ఆసుపత్రిలో మిత్రోఫానోఫ్ సర్జరీ చేయాల్సి ఉంది. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ అని డాక్టర్లు తెలిపారు.

ఏడేళ్లలో మరో 4 ఆపరేషన్లు.. 

దేవాశిష్‌‌‌‌‌‌‌‌ సాధారణ జీవితం గడపాలంటే 15 నుంచి 16 ఏండ్ల వయసు వచ్చే వరకు దశలవారీగా మరో 3 నుంచి 4 పెద్ద సర్జరీలు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఇందుకు మొత్తం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.

ర్యాపిడో నడిపే తండ్రికి భారమైన ఖర్చు.. 

దేవాశిష్‌‌‌‌‌‌‌‌ తండ్రి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రాపిడో బైక్‌‌‌‌‌‌‌‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజంతా బైక్‌‌‌‌‌‌‌‌ నడిపినా వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకే సరిపోతోంది. ఇంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ తేదీ దగ్గర పడుతున్నా డబ్బు సమకూరకపోవడంతో కన్నవాళ్లు ఆందోళన చెందుతున్నారు. దయగల దాతలు స్పందించి తమ కుమారుడి చికిత్సకు సాయం చేయాలని ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, కవిత దంపతులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు చిన్నారి తల్లి చింతల కవిత (9989955705) ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌‌‌‌‌పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ప్రార్థిస్తున్నారు.