వెయ్యి కిటికీల ఊరు.. ఎంతో స్పెషల్

వెయ్యి కిటికీల ఊరు.. ఎంతో స్పెషల్

బ్యూటిఫుల్ ఊరు గురించి చెప్పమని ఎవరైనా అడిగితే... చారిత్రక​ కట్టడాలు, జలపాతాలు, గుహలు, వెరైటీ లైఫ్​ స్టైల్​ వంటివి ఉన్న ఊళ్లు గుర్తొస్తాయి. కానీ... ఈ ఊరి గురించి చెప్పాలంటే మాత్రం ముందు ఊళ్లో ఉన్న కిటికీల గురించి చెప్పాలి. ఎందుకంటే అక్కడున్న ఇళ్లు, దేవాలయాలు, స్కూల్స్​, కాలేజీ​లు ఏవైనా... వాటికి ఉండే కిటికీలే స్పెషల్ అట్రాక్షన్​. ఒక్క మాటలో చెప్పాలంటే కిటికీలే ఆ ఊరికి అందం. కంప్యూటర్​కి విండోస్​ ఎంత ఇంపార్టెంటో...  ఈ ఊళ్లో విండోస్​ కూడా అంతే స్పెషల్!  

బెరాత్​... అల్బేనియా దేశంలో ఉన్న ఒక చిన్న ఊరు. దీన్ని ‘ది సిటీ ఆఫ్​ ఎ థౌజండ్ విండోస్​’ అంటారు. అంటే వేయి కిటికీలు ఉన్న సిటీ అన్నమాట. దీనికి ఆ పేరెలా వచ్చిందంటే... ఇక్కడి బిల్డింగ్​లన్నీ వైట్ పెయింట్ వేసిన గోడలతో,  పైకప్పు సెరామిక్ టైల్స్​తో కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే బిల్డింగ్​లన్నీ ఒకదాని మీద ఒకటి అగ్గిపెట్టెలు పేర్చినట్లు ఉంటాయి. వాటిని చూస్తుంటే ఊరంతా కిటికీలే ఉన్నాయా! అనిపిస్తుంది. అల్బేనియాలో ఉన్న తొమ్మిది పాపులర్ ఊర్లల్లో ఇదొకటి. ఆ దేశానికి దక్షిణం వైపు ఉన్న బెరాత్ ఊరి చుట్టూ పర్వతాలు, కొండలు ఉంటాయి. వాటితో పాటు తోమోర్ అనే మౌంటెన్ రేంజ్ ఉంది. దాన్ని తోమోర్ నేషనల్ పార్క్​గా ప్రకటించారు. ఈ ఊరి నుంచి ‘ఓసం’ అనే నది కూడా పారుతుంటుంది. అంతేకాదు, ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే ఎన్నో నాగరికతలు కళ్ల ముందు నిలుస్తాయి. ఎందుకంటే పూర్వం అక్కడ రకరకాల జాతుల ప్రజలు నివసించారు. అది మనకు వాళ్ల ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ స్టైల్​లో కనిపిస్తుంది. బెరాత్​లో చర్చ్​లు, మసీదులు, ఇతర కట్టడాల మీద కూడా మ్యూరల్స్, ఫ్రెసో పెయింటింగ్స్​ అందంగా వేసి ఉంటాయి. 

ట్రేడర్లు తక్కువే
18వ శతాబ్దంలో బెరాత్ సొసైటీలో ఉన్న రకరకాల వృత్తుల వాళ్లు ట్యాక్స్​ భారాన్ని తగ్గించుకోవడం కోసం సిటీ ట్రేడర్స్​తో కలిసిపోయారు.1750 నాటికి బెరాత్​ సొసైటీలో 22 మంది మాత్రమే ట్రేడర్లున్నారు. వాళ్లలో ఎక్కువగా తోళ్ళ వ్యాపారం చేసేవాళ్లు. మిగతా వాళ్లంతా మెటల్ వర్క్​, సిల్క్​ తయారుచేసే పనులుచేసేవారు. కానీ ఇప్పుడు బెరాత్​ అందుకు పూర్తి డిఫరెంట్​గా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో అల్బేనియా ఆ మిలిటరీ ఇండస్ట్రీ, దానికి దగ్గర్లో ఫ్యాక్టరీలు వెలిశాయి. అయితే వీటన్నిటితోపాటు ఇక్కడున్న హిస్టారికల్ సైట్స్​ వల్ల టూరిజం డెవలప్​ అయింది. 

టూరిస్ట్ అట్రాక్షన్స్
బెరాత్​లో కిటికీలే కాదు... చూడాల్సిన ప్లేస్​లు చాలా ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, మ్యూజియాలు, థియేటర్స్​, చర్చ్​లు, మసీదులు, బౌద్ధారామాలు (మోనస్ట్రీలు), ఇతర ప్రదేశాలు చూడదగ్గవి. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే బెరాత్​ని 2008 లో ‘‘వరల్డ్ హెరిటేజ్ సైట్’’​గా యునెస్కో ప్రకటించింది. 

చర్చ్​ల్లో హోలీ ట్రినిటీ, సెయింట్ మేరీ ఆఫ్ బ్లచర్నే, సెయింట్ థియోడోర్, సెయింట్ మైఖేల్, డోర్మిషన్​ ఆఫ్ సెయింట్ మేరీ కేథడ్రల్ ఫేమస్​. అవన్నీ రాళ్లతో కట్టినవే. బయట, లోపల ఆర్కిటెక్చర్​ ఎంతో అందంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మసీదు​ల సంఖ్య కూడా ఎక్కువే. ఆ మసీదు​లకు రెండు పేర్లుంటాయి. సిలెజ్​మాన్ పాషా మసీదు. కేవలం బ్యాచిలర్స్​కి మాత్రమే. అలాగే కింగ్​ మసీద్​​ను సుల్తాన్స్​ లేదాసుల్తాన్ బయెజిద్​ అని, లీడ్​ మసీద్​ను ఇజ్గుర్లి అని పిలుస్తారు. వీటితోపాటు ఓసం నది మీద గోరిక బ్రిడ్జ్​ కూడా చూడొచ్చు. 
బెరాత్​లో నేషనల్​ ఎత్నోగ్రాఫిక్​ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో ఫర్నిచర్​, ఇంట్లో వాడుకునే వస్తువులు, చెక్క పెట్టెలు, చిన్న బావి, చిమ్నీల వంటివి ఉన్నాయి. ఆ బావి దగ్గర ఆలివ్ ఆయిల్ తీసే గానుగ వంటివి చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్​లో హాల్, ట్రెడిషనల్ షాప్​లు ఉంటాయి. రెండో ఫ్లోర్​లో విలేజ్​ సిట్టింగ్ రూం, కిచెన్​ ఉన్నాయి.

ఒక్కో భాషలో ఒక్కోలా...
బెరాత్​ అనే పదం ఓల్డ్ స్లావొనిక్ భాషలో ‘బెల్ గ్రాడ్’ లేదా ‘బెలిగ్రాడ్’ అని పిలిచేవారు. అంటే ‘వైట్ సిటీ’ అని దానర్థం. లాటిన్​లో బెలో గ్రాడమ్, బెల్లెగ్రాడమ్, ఇటాలియన్​లో బెల్ గ్రాడో, గ్రీక్​లో బెల్లెగ్రాడా, బెల్ గ్రాడ్ – ఐ అర్నవుడ్ (అల్బేనియన్ బెల్ గ్రేడ్) అని పిలుస్తారు.