
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న పైకప్పు కూలిపోవడంతో 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పవర్ ప్లాంట్ కు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తారాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఎన్నూర్ లో ఉండి ప్లాంట్ లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న పనులు చేస్తుండగా స్లాబ్ కూలి కిందపడటంతో 9 మంది కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. ఈ విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది. మరో వైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.