- ఒకే రోజు ఫైనల్‌కు ముగ్గురు ఇండియా అథ్లెట్లు
- జావెలిన్ త్రోలో నీరజ్, రోహిత్
- ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ ముందుకు
- రేపు ఫైనల్ పోటీలు
యుగీన్ : వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు ట్రిపుల్ బొనాంజా. ఒకే రోజు ముగ్గురు అథ్లెట్లు ఫైనల్‌కు చేరుకొని ఔరా అనిపించారు. గోల్డ్ తెస్తాడని ఆశిస్తున్న ఇండియా గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్ మెన్స్ జావెలిన్ త్రోలో ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లారు. మరోవైపు ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో తుది రౌండ్‌కు అర్హత సాధించిన ఇండియా తొలి క్రీడాకారుడిగా ఎల్డోస్ పాల్ రికార్డు సృష్టించాడు. ఇండియా టైమ్ ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన మెన్స్ జావెలిన్ త్రో గ్రూప్–ఎ క్వాలిఫికేషన్‌లో బరిలో నిలిచిన నీరజ్ అంచనాలు అందుకుంటూ.. అద్భుత ఆటను కనబరిచాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 88.39 మీటర్ల దూరం విసిరాడు. అతని కెరీర్‌లో ఇది మూడో బెస్ట్ త్రో కావడం విశేషం. దీంతో చోప్రా గ్రూప్–ఎలో తొలి, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచాడు. మొదటి త్రో తోనే ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కు (83 మీ.) దాటడంతో నీరజ్ మరో రెండు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. గ్రూప్–బిలో పోటీ పడ్డ మరో ఇండియన్ రోహిత్ యాదవ్ 80.42 మీటర్లతో ఆరో ప్లేస్.. ఓవరాల్‌గా 11వ స్థానం సాధించాడు. రోహిత్ తొలి ప్రయత్నంలోనే ఈ దూరాన్ని అందుకోగా.. రెండోసారి ఫౌల్ చేశాడు. మూడో త్రో లో కేవలం 77.32 మీ. కే పరిమితం అయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) 89.91 మీ.తో ఓవరాల్‌గా టాప్ ప్లేస్ సాధించాడు. ఆదివారం ఉదయం జరిగే ఫైనల్లో చోప్రాతో పాటు రోహిత్ పతక వేటలో నిలిచారు. చోప్రాకు ప్రధానంగా పీటర్స్‌తో పాటు జులియన్ వెబర్ (జర్మనీ)తో పోటీ ఎదురవనుంది. క్వాలిఫికేషన్‌లో వెబర్ 87.28 మీ. తో ఓవరాల్‌గా మూడో స్థానం సాధించాడు.
ఎల్డోస్ తొలిసారి
ట్రిపుల్ జంప్‌లో ఫైనల్ చేరిన ఎల్డోస్ పాల్ అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. 16.68 మీ. దూరం దూరం దూకిన అతను గ్రూప్-–ఎలో ఆరో స్థానం, ఓవరాల్‌గా 12వ స్థానంతో తుది పోరుకు చేరాడు. 25 ఏండ్ల పాల్ ఈ టోర్నీకి వచ్చే ముందు వీసా సమస్యలు ఎదుర్కొన్నాడు. మిగతా అథ్లెట్లతో కాకుండా ఆలస్యంగా యుగీన్‌లో అడుగుపెట్టిన అతను ఫైనల్ చేరి ఔరా అనిపించాడు. పాల్ ఆదివారం జరిగే ఫైనల్లో పోటీ పడుతాడు. ఇదే ఈవెంట్‌లో పోటీ పడ్డ ప్రవీణ్ చిత్రవేల్ ( 16.49 మీ), అబ్దుల్లా అబూబేకర్ (16.45 మీ) ఓవరాల్‌గా 17, 19వ స్థానాలతో నిరాశ పరిచారు.
నేడు విమెన్స్ జావెలిన్ ఫైనల్ బరిలో అన్ను
విమెన్స్ జావెలిన్ త్రోలో వరుసగా రెండో పర్యాయం ఫైనల్ చేరిన అన్ను రాణి శనివారం జరిగే తుది రౌండ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రాణి 59.60 మీటర్లతో ఓవరాల్‌గా ఎనిమిదో స్థానం సాధించింది.
