బిహార్ లో మరో "పకాడ్వా షాదీ"

బిహార్ లో మరో "పకాడ్వా షాదీ"

ప్రేమ వివాహాలు చూసుంటాం. పెద్దలు కుదిర్చిన వివాహాలూ చూసుంటాం. కానీ కిడ్నాప్ చేసి, తీసుకెళ్లి పెళ్లి చేయడం ఎప్పుడైనా చూశారా.. ? ఇది మనకు వినడానికి కొత్తగా అనిపిస్తుండొచ్చు. కానీ బిహార్ లో మాత్రం కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలా ఎత్తుకెళ్లి.. బలవంతంగా వివాహం చేయడం అక్కడ ట్రెండ్ అయింది. 

ఇకపోతే తాజాగా అలాంటి సంఘటనే ఒకటి బిహార్ లో జరిగింది. ఓ పశువైద్యుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన బెగుసరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది. పిధౌలి గ్రామంలో పశువులకు వైద్యం చేసేందుకని పిలిచిన అమ్మాయి తరపు బంధువులు.. సత్యం ఝా అనే వైద్యుడిని తీసుకెళ్లి..  ఓ మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. ఎంత సేపటికీ సత్యం ఇంటికి రాకపోవడంతో అతని ఇంటి సభ్యులు గాభరా పడ్డారు. ఆ సమయంలోనే వారి మొబైల్ ఫోన్ కి ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చిందని.. ఓపెన్ చేసి చూస్తే తమ కుమారుడు, ఓ అమ్మాయి పక్కన కూర్చొని వివాహ తంతులో పాల్గొన్నాడని అతని తండ్రి సుబోధ్ కుమార్ ఝా తెలిపారు. దీంతో సత్యం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపడతామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

పకాడ్వా వ్యాహ్ అంటే.. ?

బిహార్ లో "పకాడ్వా షాదీ" పేరుతో పిలవబడే పెళ్లిళ్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. చాలా మంది తమ పిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్థోమత లేక, ఈ రకమైన పెళ్లిళ్లు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బలవంతంగా పెళ్లి చేసినా.. దాన్ని వాళ్లు అసలు పెళ్లి లానే భావిస్తారు. ఇక ఆ అబ్బాయికి చేసుకున్న అమ్మాయి నచ్చినా.. నచ్చకపోయినా భార్యగా స్వీకరించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లి కాని అబ్బాయిలను ఇలా బలవంతంగా తీసుకొచ్చి, అమ్మాయికిచ్చి వివాహం చేయడమే పకాడ్వా షాదీ.