ఇండోనేషియా జూ : వామ్మో ఒరంగుటాన్ ఎంత పని చేసింది..?

ఇండోనేషియా జూ :  వామ్మో ఒరంగుటాన్ ఎంత పని చేసింది..?

జకార్తా : ఎవరైనా, ఎప్పుడైనా జూకు వెళ్లినప్పుడు జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని దూరం నుంచి చూసి ఆనందించాలే తప్ప.. వాటితో సెల్ఫీలు తీసుకోవాలని, లేదంటే రెచ్చగొట్టాలని చూస్తే టైం బాగోలేకపోతే అంతే సంగతి. వాటి దగ్గరకు వెళ్లినప్పుడు అవి మనపై దాడి చేయొచ్చు. కొన్నిసార్లు క్రూర జంతువులైతే చంపేయడానికి కూడా వెనకాడుగు వేయవు. జూలో మూగ జీవాల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలియజేస్తోంది ఈ ఘటన.

ఇండోనేషియాలోని కసంగ్ కులీమ్ జూలోని ఒరంగుటాన్‌ ఎన్‌క్లోజర్‌కు చాలా దగ్గరగా ఓ సందర్శకుడు వెళ్లాడు. కాస్త దూరం నుంచి చూడకుండా బారికేడ్‌ను దాటుకుని ఎన్‌క్లోజర్‌కు బాగా దగ్గరకు వెళ్లాడు. రెండు చేతులు ముందుకు చాచి దానిని రెచ్చగొట్టాడు. వెంటనే అది కోపంతో అతడి చేతులను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఒరంగుటాన్‌ చేతికి అతడి టీ షర్టు చిక్కింది. దీంతో టీ షర్టును గట్టిగా పట్టుకుని అతడ్ని ముందుకు లాగేందుకు ప్రయత్నించింది. దాని నుంచి విడిపించుకునేందుకు బాధితుడు త్రీవంగా ప్రయత్నించాడు. 

ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బాధితుడి అరుపులు విని.. దగ్గరకు వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. ఒరంగుటాన్‌ చేతి నుంచి టీ షర్టును బలంగా లాగేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించారు. అయితే.. ఆ వ్యక్తి టీ షర్టును వదిలిన ఒరంగుటాన్‌ అతడి కాలును రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. వారిద్దరూ ఎంత ప్రయత్నించినా అతడి కాలును మాత్రం విడిచిపెట్టలేదు. చివరకు ఎలాగోలా దాని నుంచి బయటపడి ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 

ఈ ఘటన పట్ల కసంగ్ కులీమ్ జూ నిర్వాహకులు స్పందించారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు జూలోని జంతువుల మానసిక పరిస్థితికి ఇది అద్దం పడుతుందని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను జూలో నిర్బంధించడం అన్యాయమంటూ గళమెత్తుతున్నారు.