ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే  మధ్య మాటల తూటాలు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే  మధ్య మాటల తూటాలు
  • ఆలయంలో ప్రమాణం చేయాలని మనోహర్​రెడ్డికి విజయరమణారావు సవాల్​
  • టెంపుల్​కు వచ్చి ఫొటోపై ప్రమాణం చేసిన మాజీ ఎమ్మెల్యే 

పెద్దపల్లి, వెలుగు : మానేరు నదిలో ఇసుక అక్రమ రవాణాపై పెద్దపల్లి కేంద్రంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుల మధ్య వారం రోజులుగా నడుస్తున్న లొల్లి ఆదివారం పతాక స్థాయికి చేరింది. సవాల్​చేసినట్లుగానే విజయరమణారావు పోలీసులకు దొరకకుండా ఓదెల మల్లన్న ఆలయానికి వచ్చి ఇసుక రీచ్​ల ద్వారా తనకు ఎలాంటి ముడుపులు అందలేదని దేవుడిపై  ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే ఆలయం వద్ద మోహరించిన పోలీసులు విజయరమణారావును అరెస్టు చేసి ధర్మారం పోలీసుస్టేషన్​కు తరలించారు. ఎమ్మెల్యే మనోహర్​రెడ్డిని మాత్రం పెద్దపల్లి పోలీసులు ముందస్తుగానే హౌజ్​అరెస్టు చేశారు. 

వారం కింద మొదలు  

వారం క్రితం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మానేరు ఇసుక రీచ్​లలో ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని రూ. కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై మరుసటి రోజు ఎమ్మెల్యే దాసరి ఘాటుగా స్పందించారు. మొగోడు ఎవరైనా తన అవినీతిని నిరూపించాలని సవాల్​చేశారు. 

అవినీతికి పాల్పడ్డవారే తనను అవినీతిపరుడని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన విజయరమణారావు ఎమ్మెల్యే దాసరికి సవాల్​విసిరారు. అక్టోబర్​2న ఓదెల మల్లన్న టెంపుల్​లో అవినీతికి పాల్పడలేదని ఇద్దరం ప్రమాణం చేద్దామని, సవాల్​కు ఒప్పుకొని ఆలయానికి రావాలని కోరారు. ఇద్దరు నాయకులు తమ అనుచరులను గ్రామానికి 50 మంది చొప్పున ఓదెల టెంపుల్​కు రావాలని సూచించారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఓదెల మల్లన్న ఆలయం కాంగ్రెస్, టీఆర్ఎస్​నాయకుల చాలెంజ్​లతో ఉద్రిక్తంగా మారింది. 

అప్రమత్తమైన పోలీసులు..

చాలెంజ్​లతో కాక పుట్టిన క్రమంలో పెద్దపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్​ నాయకులను శనివారం రాత్రి నుంచే అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. అరెస్టుల విషయం తెలుసుకున్న కాంగ్రెస్​, టీఆర్ఎస్​ లీడర్లు రాత్రంతా రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. ఓదెలకు వెళ్లే మార్గాలన్నీ పోలీసుల నిర్బంధంలోకి వెళ్లాయి. టెంపుల్​కు చేరుకుంటున్న టీఆర్ఎస్​, కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. మాజీ ఎమ్మె ల్యే విజయరమణారావు తన ఇంట్లో ఉండకుండా రాత్రంతా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఎవరూ ఊహించని విధంగా అనుకున్న టైంకు విజయరమణరావు మోటారు బైక్​పై టెంపుల్​ముందుకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుడిలోకి పరిగెత్తే విజయరమణారావును ఏసీపీ సారంగపాణి అడ్డుకున్నారు. అయినా అక్కడే ఉన్న ఓదెల మల్లన్న ఫొటో తీసుకొని తనకు ఇసుక రీచుల్లో జరిగిన అవినీతికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. తర్వాత పోలీసులు విజయరమణరావును అరెస్టు చేసి ధర్మారం తరలించారు. 

ఇప్పటికైనా ప్రమాణం చెయ్​

ఇసుక అవినీతిలో ఎమ్మెల్యే నిజ స్వరూపం బయటపడిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.  అక్రమాలు బట్ట బయలు అవుతాయనే భయంతోనే ఎమ్మెల్యే దాసరి ప్రమాణం చేయడానికి ఓదెల మల్లన్న ఆలయానికి రాలేదన్నారు. సవాల్ ​స్వీకరించకుండా పొలీసులతో అక్రమంగా అరెస్టు చేయించి అడ్డుకున్నారన్నారు. అందుకే  ఓదెల మల్లన్న గుడి ప్రాంగణంలో మల్లికార్జున స్వామి ఫొటోపై తాను ప్రమాణం చేశానన్నారు. ఇసుక అవినీతిలో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి నిజాయతీపరుడైతే ఓదెల మల్లన్న స్వామిపై ప్రమాణం చేసి తన నిజాయతీనిరూపించుకోవాలని డిమాండ్​ చేశారు.  

పోలీస్​స్టేషన్లలో తన్నుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ​లీడర్లు  

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో అరెస్టయిన టీఆర్ఎస్, కాంగ్రెస్​ నాయకులు తన్నుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సుల్తానాబాద్ పోలీసులు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను  అదుపులోకి తీసుకొని సుల్తానాబాద్​పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో ఇరుపార్టీల లీడర్లు తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని నినదించారు. తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ గుంపు పైకి దూసుకువచ్చారు. ఇదే రీతిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్పందించారు. దీంతో పోలీస్ స్టేషన్​లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన పోలీసులు అతి కష్టం మీద వారిని కంట్రోల్​చేయగలిగారు.