బజార్నపడ్డ ..ఆర్మూర్​ పాలిటిక్స్​

బజార్నపడ్డ ..ఆర్మూర్​ పాలిటిక్స్​
  •     ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య  మాటల యుద్ధం 
  •      వ్యక్తిగత జీవితాల పైనా  విమర్శలు   
  •      శృతి మించుతున్న తిట్లు, నిందలు 
  •     ఎలక్షన్​ ముగిసినా చల్లారని మంట  

నిజామాబాద్​, వెలుగు :  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో  రాజకీయాలు శ్రుతి మించుతున్నాయి.   ఎన్నికలు ముగిసి నెలరోజులు దాటినా  ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి .. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​రెడ్డి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. బూతులు, పరుష పదజాలంతో ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

పర్సనల్​విషయాల మీద కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.  సంక్రాంతి సందర్భంగా  వారిద్దరు  మీడియా ఇంటర్వ్యూల్లో ఒకరి మీద మరొకరు చేసిన కామెంట్స్ .. సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే విషయం మీద చర్చ జరుగుతోంది. 

ఎవరూ తగ్గేదేలే

 ‘నేను బహుబలి, వాడు బళ్లాల దేవుడు’ అని   ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి  కామెంట్​ చేస్తే..  ‘వాడో చదువులేని అజ్ఞాని, మూర్ఖుడు, సైకో, స్మగ్లర్’ అంటూ  జీవన్​రెడ్డి మండిపడ్డారు.  మీడియా ఇంటర్వ్యూల్లో  రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తవ్వుకుంటూ రెచ్చిపోతున్నారు.  ఎన్నికల్లోనూ తీవ్ర విమర్శలు చేసుకున్న రాకేశ్​రెడ్డి, జీవన్​రెడ్డి ఎన్నికలు ముగిసిన తర్వాత మరింత ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవహారాలను కూడా బజారులో పెట్టుకోవడంపై  విస్మయం వ్యక్తమవుతోంది.

జిల్లా  రాజకీయాల్లో గతంలోనూ పలువురు వ్యక్తిగతంగా  విమర్శలు చేసుకున్నా   ఇంత దారుణంగా  ఎవరూ బజారుకెక్కలేదని, వీరు తీరు ఆర్మూరు  ప్రతిష్టను దిగజార్చేలా ఉందని స్థానిక పెద్దలు  అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

గతంలో ఇద్ధరూ  ఫ్రెండ్సే  

ముందు  జీవన్​రెడ్డి రాజకీయాల్లో చేరి  2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆర్మూరు నుంచి ప్రాతినిధ్యం వహించగా.. రాకేశ్​​రెడ్డి బిజినెస్​ మాన్​గా ఎదిగారు. ఇద్దరిదీ ఒకే ఏరియా కావడంతో వీరి మధ్య   ఫ్రెండ్​ షిప్​ ఉండేదని దగ్గరి నుంచి చూసిన వ్యక్తులు చెబుతారు.  రాజకీయాల్లోకి రావాలనుకున్న రాకేశ్​రెడ్డి ఈ విషయం జీవన్​రెడ్డికి  తన ఇంట్రెస్ట్​గురించి చెప్పిన తర్వాత వారి మధ్య  తేడాలు వచ్చాయంటారు. రాకేశ్​ తనకు ప్రత్యర్థిగా ఎదగకుండా   జీవన్​రెడ్డి వ్యవహరించారని, దీంతో అతని మీద రాకేశ్ కోపం పెంచుకున్నారని చెప్తుంటారు.  

అసెంబ్లీ ఎలక్షన్​కు మూడు నెలల ముందు బీజేపీలో చేరిన రాకేశ్​​రెడ్డి అనూహ్యంగా టికెట్​ సాధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గెలిచారు.  జీవన్​రెడ్డిని  మూడవ స్థానానికి పరిమితం చేశారు.  ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా   వేదిక ఏదైనా   ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం సాధారణమైంది.  ప్రెస్ మీట్లలో  విలేకరులు ఏ విషయంలో కదిలించినా  తిట్ల వర్షం మొదలుపెడుతున్నారు. వీరి మధ్య కొనసాగుతున్న వార్​ ఎంత దూరం వెళ్తుందోనన్న చర్చ ఆసక్తిగా మారింది.