- మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘటన
తూప్రాన్, వెలుగు : లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆదివారం జరిగింది. తూప్రాన్ ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... తూప్రాన్ పట్టణంలోని ఎన్నేల్లి వరలక్ష్మి (35) తన ఇంటి అవసరాల కోసం మేడ్చల్‌లోని ఫైవ్‌స్టార్ బ్యాంక్‌లో రూ. 4 లక్షలు, బంధన్ బ్యాంక్‌లో రూ. 69 వేలు, క్రిష్ బ్యాంక్‌లో రూ. 70 వేల లోన్ తీసుకుంది.
మొదట్లో ఈఎంఐలు సరిగానే కట్టిన వరలక్ష్మి.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈఎంఐలు కట్టలేదు. దీంతో లోన్ రికవరీ ఏజెంట్లు పలుమార్లు ఇంటికి వెళ్లి వేధించారు. ఆదివారం సైతం రివకరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి వేధించడంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి స్థానిక పెద్ద చెరువులో దూకింది. గమనించిన కుటుంబ సభ్యులు వరలక్ష్మిని బయటకు తీసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
