తనకు అర్హత ఉన్నప్పటికీ రైతు బంధు సాయం అందలేదని ప్రభుత్వంపై ఓ మహిళా రైతు హైకోర్టులో పిటిషన్ వేసింది. పెద్దపల్లి జిల్లా రాయదండి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ తనకు 2019లో వానాకాలం, యాసంగిలో రావాల్సిన రైతు బంధు ఇవ్వలేదని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, తన న్యాయం చేయాలని కోరింది. తన పిటిషన్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను ప్రతివాదులగా చేర్చింది. జీవో నంబర్ 231, 202 ప్రకారం రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి అర్హులేనని పిటిషన్‌లో వరలక్ష్మి వివరించింది. అయితే 2019లో తనకు రైతు బంధు సాయం అందలేదని, అర్హత ఉన్నప్పటికీ సాయం అందకపోవడంపై చాలా సార్లు అధికారులను సంప్రదించానని తెలిపింది. కానీ, తనకు రావాల్సిన ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని, రైతుల పట్ల ఇలా వివక్ష చూపడం తగదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (జూన్ 25న) వాదనలు వింటామని తెలిపింది.
