
న్యూఢిల్లీ, వెలుగు: కువైట్ లో భారత రాయబారి, ఏపీకి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కె. జీవసాగర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఢిల్లీలోని పాటియాల కోర్టును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై14 నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నానని ఆమె శుక్రవారం మీడియాకు వెల్లడించింది. జీవసాగర్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించిందని బాధితురాలి తరపు లాయర్ సుభాష్ చంద్రన్ తెలిపారు. ఇండియా నుంచి కువైట్ వెళ్లిన తాను సామాజిక కార్యకర్తగా పని చేశానని, అక్కడి ఇండియన్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని బాధిత మహిళ చెప్పారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో సాంస్కృతిక ఈవెంట్ల సందర్భంగా ఉన్నతాధికారులను కలిసేదానినని తెలిపారు. ఈ క్రమంలో పరిచయమైన జీవ సాగర్ లైంగిక వేధింపులు మొదలుపెట్టారని, 2018 నవంబర్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. కువైట్ పోలీసులను ఆశ్రయించగా, ఇది ఎంబసీ పరిధిలోకే వస్తుందని చెప్పారన్నారు. దీంతో ఇండియాకు వచ్చి కేంద్ర హోం శాఖ ఆఫీసులో కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మళ్లీ కేసును హోం శాఖకే పంపారన్నారు. తర్వాత పాటియాల కోర్టును ఆశ్రయించగా, తాజాగా కేసును విచారణకు స్వీకరించినట్లు వివరించారు. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన కె.జీవసాగర్1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. ఆయన 2017 నుంచి కువైట్ రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారు.