మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్న యువతి

మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్న యువతి

కామారెడ్డి: మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్న ఓ యువతి... రెండేళ్లుగా అందులోనే ఉంటోంది. ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక స్థోమతలేక మరుగుదొడ్డిలోనే జీవనం సాగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట్ గ్రామానికి చెందిన సోనికి... రెండేళ్ల కిందట వాడీ గ్రామానికి చెందిన రంజిత్ తో వివాహమైంది. అయితే భర్త నిత్యం తాగొచ్చి మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక పెళ్లైన కొన్ని రోజులకే సోని పుట్టింటికి తిరిగి వచ్చింది. సోని తండ్రి ఎల్లయ్య చిన్నప్పుడే చనిపోగా... తల్లి కూడా రెండేళ్ల కిందట చనిపోయింది. దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు భర్త లేకపోవడంతో సోని ఒంటరిదైంది. దీనికి తోడు తాను ఉంటున్న పూరిగుడిసె కూడా రెండేళ్ల కిందట కూలిపోయింది.

ఇక కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులేక పోవడంతో స్వచ్ఛభారత్ కింద నిర్మించుకున్న మరుగుదొడ్డినే  సోని ఇల్లుగా మార్చుకుంది. అప్పటి నుంచి అందులోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. బీడీలు చుడ్తూ పూటగడుపుకుంటోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరుగుదొడ్డిలోకి నీళ్లు వచ్చాయి. దీనికితోడు మరుగుదొడ్డిలోకి నిత్యం పాములు వస్తుండేవి. దీంతో స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్ లో సోని తాత్కాలికంగా తల దాచుకుంటోంది. ఇలా అయినవాళ్లు లేక... ఇల్లు లేక సోని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని ఆ పేద మహిళ వేడుకుంటోంది.