40 ఏండ్ల తర్వాత వరంగల్​లో మళ్లీ మహిళ గెలుపు

40 ఏండ్ల తర్వాత వరంగల్​లో మళ్లీ మహిళ గెలుపు
  • 1984 లో టీడీపీ నుంచి  గెలిచిన కల్పనాదేవి 
  • 1989 తర్వాత మహిళలకు ఛాన్స్​ ఇవ్వని ప్రధాన పార్టీలు 
  • ఇన్నాళ్లకు కావ్యకు అవకాశం  వరంగల్​ నుంచి కాంగ్రెస్ 
  • తొలి మహిళా ఎంపీగా రికార్డు

హనుమకొండ, వెలుగు: వరంగల్ ఎంపీగా కడియం కావ్య చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో దాదాపు 40 ఏండ్ల తర్వాత గెలిచిన మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1984లో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ​టి.కల్పనాదేవి కాంగ్రెస్ ​అభ్యర్థి కమాలుద్దీన్ ​అహ్మద్​పై పోటీ చేసి 8,456  ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మళ్లీ 1989లో ఆమె పోటీ చేసినా గెలవలేదు. 

ఆ ఎన్నిక తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పార్టీలు మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఇండిపెండెంట్​గా కొందరు బరిలో నిలిచినా గెలుపొందలేదు. మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కడియం కావ్యకు ఛాన్స్​ ఇవ్వగా, ఆమె బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​పై 2,20,339 ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు.  కాగా, వరంగల్ స్థానంలో కాంగ్రెస్ ​నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళ ఎంపీగా కడియం కావ్య రికార్డు సాధించడం గమనార్హం.