- దాటలేక గ్రామానికి వెళ్లలేకపోయిన 108
- స్ట్రెచర్ తీసుకువెళ్లి పేషెంట్‌ను తీసుకువచ్చిన సిబ్బంది
- గంట సమయం వృథా
- దవాఖానలో మృతి చెందిన వృద్ధురాలు
- వేములవాడ జిల్లా హన్మాజీపేటలో ఘటన
వేములవాడ రూరల్, వెలుగు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని గ్రామం నుంచి దవాఖానకు తరలించేందుకు108 అంబులెన్స్ రాగా వాగు అడ్డం రావడంతో దాటలేకపోయింది. దీంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లడానికి ఆలస్యమై ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన ఐత లక్ష్మి (67) ఆస్తమాతో బాధపడుతోంది. శుక్రవారం శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది రావడంతో ఆమె భర్త నారాయణ ఉదయం 8 గంటలకు108కు ఫోన్‌చేశాడు.
వేములవాడ నుంచి అరగంటలోనే వాహనం గ్రామానికి చేరుకుంది. హన్మాజీపేటలో వాగు దాట లేక ఒడ్డునే ఆగిపోయింది. సిబ్బంది స్ట్రెచర్ తీసుకుని వాగు దాటి లక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను స్ట్రెచర్‌పై పడుకోబెట్టుకుని తిరిగి వాగు దాటించి అంబులెన్స్‌లో ఎక్కించారు. ఇదంతా జరగడానికి సుమారు గంట సమయం పట్టింది. తర్వాత వేములవాడ ప్రభుత్వ ఏరియా దవాఖానలో చేర్పించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయింది.
పది నెలల కింద బ్రిడ్జి ప్రారంభం
హనుమాజిపేటలో ఉన్న నక్క వాగు వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల కింద వాగు దగ్గర రూ.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇది పూర్తయితే లింగంపల్లి, బొల్లారం, హన్మాజీపేట, కోనరావుపేట మండలంలోని మూడు గ్రామాలు, నిజామాబాద్జిల్లాలోని కొన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికలకు ముందే నిధులు విడుదల చేయడంతో కోడ్‌తో పనులు ఆగిపోయాయి. బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేసి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
