- ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు పేరిట మోసం
- 9 మంది నుంచి రూ.58.75 లక్షలు వసూల్
- కర్నాటకలో కిలేడీ అరెస్ట్
- పరారీలో మరో ముగ్గురు
హైదరాబాద్, వెలుగు: మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కిలేడీని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. 15 సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్,10 సిమ్ కార్డులు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన రేష్మ అలియాస్ స్వప్న(30) 2009లో హైదరాబాద్ వచ్చింది. హైటెక్ సిటీ సమీపంలోని ఓ కన్సల్టెన్సీలో టెలీకాలర్‌గా చేరింది. అక్కడి మేనేజర్ మహ్మద్ అలీతో పరిచయం ఏర్పడి 2013లో పెండ్లి చేసుకుంది.
2022లో విడాకులు తీసుకొని, మళ్లీ అతడితోనే కలిసి ఉంటోంది. వీరిద్దరూ కలిసి కన్‌ల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారు. రేష్మ ప్రముఖ ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో కీలక పోస్టుల్లో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకునేది. ఈ క్రమంలోనే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్‌గా మోసాలకు తెరతీసింది. వివిధ జాబ్ పోర్టల్స్‌తో పాటు కన్సల్టెన్సీల నుంచి సేకరించే డేటా ఆధారంగా నిరుద్యోగులను టార్గెట్ చేసేది.
ప్రాసెసింగ్ ఫీజ్ ఇతర చార్జీల పేరుతో..
ఫోన్‌కాల్స్, మెయిల్స్, వాట్సాప్ ద్వారా ట్రాప్ చేసి, ఆసక్తి చూపిన వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజ్ ఇతర చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేది. ఆ తరువాత ఫేక్ ఆఫర్ లెటర్స్‌ను మెయిల్ చేసేది. ఐబీఎమ్, కాగ్నిజెంట్ సంస్థల్లో హాజరుకావాలని నమ్మించేది.
ఇలా గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన 9 మంది బాధితుల నుంచి రూ.58.75 లక్షలు వసూలు చేసింది. బాధితులు ఈ ఏడాది ఆగస్ట్‌లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రేష్మతో పాటు మహ్మద్ అలీ, ఫజీల్ పటేల్, ఫిర్దోస్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
కర్నాటక కలబురగీ హుస్సేనీ ప్లాజా వద్ద రేష్మను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. మహ్మద్ అలీ, ఫజీల్ పటేల్, ఫిర్దోస్ కోసం గాలిస్తున్నారు. ఆమెపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 5 కేసులు నమోదు కాగా, కర్నాటకలో ఆరు కేసులు రిజిస్టర్ అయ్యాయి.