పాలమూరులో తైవాన్​ జామ.. యువ రైతు సక్సెస్

పాలమూరులో తైవాన్​ జామ.. యువ రైతు సక్సెస్

పెద్ద చదువులు చదివి ఉద్యోగం సంపాదించాడు. దాంట్లో ఏమంత గొప్పగా అనిపించలేదు. సొంతంగా ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సొంతూరొచ్చాడు. డెయిరీ మొదలుపెట్టాడు. కానీ నష్టాలు వచ్చాయి. అయినా, వెనక్కు తగ్గలేదు. సొంతంగా ఏదైనా చేయాలనే పట్టుదలతో వ్యవసాయంలోకి దిగాడు. పాలమూరులో తైవాన్‌ జామను పండిస్తూ సక్సెస్‌ అయిన బాలవర్ధన్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరీ. 

మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్​ మండలానికి చెందిన బాలవర్ధన్‌రెడ్డి బీఎస్సీ ఫార్మా కెమిస్ట్రీ చదివాడు. బెంగళూరులోని ఒక ఫార్మా కంపెనీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా చేరాడు. దాదాపు నాలుగేండ్లపాటు అక్కడ పనిచేశాడు. ఒకరికింద పనిచేయడం ఇష్టంలేని బాలవర్ధన్‌రెడ్డి సొంతూరికి వచ్చి డెయిరీ ఫాం పెట్టాడు. కానీ, అనుకున్నది ఒకటైతే అయినది ఒకటి అన్నట్లుగా దాంట్లో నష్టాలు వచ్చాయి. ఎలాగైనా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదలతో ఏం చేస్తే బాగుంటుందనే రీసెర్చ్‌ మొదలుపెట్టాడు. అప్పుడే తక్కువ కాలంలో పంట చేతికొచ్చే తైవాన్‌ జామ సాగు గురించి ఫ్రెండ్‌ చెప్పాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న బాలవర్ధన్‌ తన ఆలోచనలకు టెక్నాలజీ సాయంతో జామ పండ్లు సాగుచేస్తున్నాడు. క్లోనింగ్​ హైడెన్సిటీ పద్ధతిలో ఏడాది పొడవునా పంట పండిస్తున్నాడు.

ఆర్గానిక్​ పద్ధతిలో..
ఎలాంటి మందులు వాడకుండా తైవాన్‌ జామ కాయల సాగు చేస్తున్నాడు. పిండినల్లి, నిమటూట్స్​ సమస్యలకు సేంద్రియ పద్దతిలోనే చెక్​పెడుతున్నాడు బాలవర్ధన్‌రెడ్డి.  గంజి, ఇంగువ ద్రావణాలు, వేప కషాయం, సర్ఫ్​, సోడా కలిపి పిచికారి చేస్తున్నాడు. ఇంగువ వాడటం వల్ల జామపూత ఎక్కువగా వచ్చి కాయలు బాగా కాస్తాయని చెప్తున్నాడు బాలవర్ధన్‌రెడ్డి.  దీంతో పాటు హై డెన్సిటీ పద్ధతిలో ఎకరాకు 1,100 మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ఒక్కో మొక్క మధ్యలో ఆరు ఫీట్ల దూరం ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. దీంతో ఎకరాకు 15 టన్నుల దిగుబడి వస్తుంది అంటున్నాడు ఈ యువరైతు. 

‘సొతూరులోనే ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చా. డెయిరీ పెట్టి నష్టాల్లో ఉన్న నాకు బెంగళూరుకు చెందిన నా కొలిగ్​ జామతోట సలహా ఇచ్చాడు. అధికారుల సాయంతో డ్రిప్​ ఇరిగేషన్​ సిస్టం ద్వార హైడెన్సిటి పద్దతిలో జామ తోట పెట్టాను. మొక్కలు కూడా బెంగళూరు నుంచి తెప్పించి 12 ఎకరాల పొలం లీజుకు తీసుకుని సాగు మొదలుపెట్టాను. ఆర్గానిక్​ పద్ధతిలో జామ చెట్లను పెంచి వచ్చిన క్రాప్​ను సొంతంగా​ మార్కెటింగ్​ చేస్తున్నాను. దీనివల్ల  పండ్ల వ్యాపారులు లాభపడటమే కాకుండా ఇక్కడే అమ్ముకోవచ్చు’ అని బాలవర్ధన్ రెడ్డి తన వ్యాపారం గురించి చెప్పాడు.