చొప్పదండి, వెలుగు: వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బుధవారం జరిగింది. ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన కటుకటం శరత్ చంద్ర (39) కరీంనగర్‌లో ఉంటున్నారు. గతంలో స్థానిక విద్యానగర్‌లో బట్టల దుకాణం నడిపించాడు. వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తులతో పాటు, పలు యాప్స్‌లో అప్పులు చేశాడు. వ్యాపారంలో నష్టం రావడంతో బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అప్పులు తీర్చినా.. యాప్స్‌లో తీసుకున్న అప్పులు అలాగే మిగిలిపోయాయి.
తర్వాత వ్యాపారాన్ని మానేసి ప్రస్తుతం మెడికల్ రిప్రజింటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యాప్‌లో తీసుకున్న అప్పులు కట్టలేక ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో శరత్ చంద్ర మంగళవారం డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోగా.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
దీంతో బుధవారం సాయంత్రం శరత్ చంద్ర కుటుంబ సభ్యులు చొప్పదండిలో ఉన్న అతడి ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశారు. వారు గ్రామంలోని అతడి ఇంటికి వెళ్లి చూడగా.. లోపలి వైపు గడియపెట్టి ఉంది. తలుపులు పగులగొట్టి చూడగా.. శరత్‌చంద్ర ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి భార్య దివ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

