డబుల్​ బెడ్​రూం ఇల్లు రాలేదని .. జీపీ ఆఫీసుకు నిప్పుపెట్టే యత్నం

డబుల్​ బెడ్​రూం ఇల్లు రాలేదని .. జీపీ ఆఫీసుకు నిప్పుపెట్టే యత్నం
  • కామారెడ్డి జిల్లా సిద్దిరామేశ్వరనగర్​లో ఘటన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో డబుల్​బెడ్​రూం ఇల్లు రాలేదని ఓ యువకుడు  గ్రామ పంచాయతీ ఆఫీసులో ఫర్నిచర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించబోయాడు. వెంటనే సర్పంచ్, అక్కడున్న మరికొందరు అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. స్థానికుల కథనం ప్రకారం..భిక్కనూరు మండలం సిద్దిరామేశ్వరనగర్​కు చెందిన గంధం రంజిత్​మంగళవారం గ్రామ పంచాయతీ ఆఫీసుకు వచ్చాడు. 

అక్కడ సర్పంచ్ ​జనగామ  శ్రీనివాస్,  వీడీసీ ప్రెసిడెంట్​బోనాల శ్రీనివాస్​, మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. తమ కుటుంబానికి డబుల్ బెడ్​రూం ఎందుకు ఇవ్వలేదంటూ రంజిత్ ​సర్పంచ్​తో వాగ్వాదానికి  దిగాడు. దీనికి సర్పంచ్​‘మీ అమ్మ పేరిట ఆల్​రెడీ ఇల్లు అలాటైంది. గ్రామానికి 8 ఇండ్లు అలాటైనా సర్కారు నుంచి ఆర్డర్స్​ రాలేదు’ అని చెప్పాడు. అయినా, వినిపించుకోని రంజిత్ ​కావాలనే ఆలస్యం చేస్తున్నారని అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపటి తర్వాత పెట్రోల్​ డబ్బాతో వచ్చాడు. 

సర్పంచ్ బయట మాట్లాడుతుండగా లోపలకు వెళ్లి  ఫర్నిచర్​పై పెట్రోల్​పోసి నిప్పటించాడు. ఇది చూసిన సర్పంచ్, మరికొందరిపై లోపలకు పరిగెత్తుకు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో కొన్ని ఆఫీసు పేపర్లు కాలిపోయాయి. రంజిత్​ తనపై కూడా పెట్రోల్ ​పోశాడని సర్పంచ్​ఆరోపించాడు. సర్పంచ్, ఆఫీసర్లు భిక్కనూరు పీఎస్​లో ఫిర్యాదు చేశారు.