దేశంలో అక్రమంగా ఉంటున్న పాక్​ యువతి అరెస్ట్

దేశంలో అక్రమంగా ఉంటున్న పాక్​ యువతి అరెస్ట్
  • అరెస్టు చేసిన కర్నాటక పోలీసులు 

బెంగళూరు: తన అసలు పేరు, ఊరూ దాచిపెట్టి  బెంగళూరు సిటీలో అక్రమంగా ఉంటున్న 19 ఏండ్ల పాకిస్తాన్ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జివానీ అనే యువతి గేమింగ్ యాప్ ద్వారా ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు ములాయం సింగ్ యాదవ్​కు పరిచయమైంది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం నేపాల్​లో కలిసి, పెండ్లి చేసుకున్నారు. అనంతరం బార్డర్​ దాటి బీహార్ చేరుకున్నారు. అక్కడి నుంచి జివానీని.. ములాయం సింగ్  తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేసే బెంగళూరుకు తీసుకువచ్చాడు. జున్నసాండ్ర ప్రాంతంలో ఒక ఇంటిని కిరాయికి తీసుకొని ఉంటున్నారు.

ఆ తర్వాత ఇక్రా జివానీ తన పేరును రావ యాదవ్‌‌గా మార్చుకొని ఆధార్ కార్డు కూడా తీసుకుంది. పాస్‌‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. అయితే, జివానీ పాకిస్తాన్‌‌లోని తన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. వెంటనే స్టేట్ ఇంటెలిజెన్స్‌‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బెంగళూరు పోలీసులు వారిని విచారించి అరెస్టు చేశారు. ఇక్రా జివానీ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకు అప్పగించారు. వారు ఆమెను స్టేట్ హోమ్‌‌కు తరలించారు. అలాగే, ములాయం సింగ్‌‌ను కూడా అరెస్టు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్​ యువతి నివాసముంటున్న విషయాన్ని తెలియజేయలేదని ఇంటి ఓనర్​ గోవింద రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.