డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన యువతి అరెస్ట్

డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన యువతి అరెస్ట్
  • ముంబయి నుంచిహైదరాబాద్​కు సప్లయ్
  • యువతితో పాటు మరో నలుగురిని   అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్, వెలుగు : ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో అమ్మేందుకు యత్నించిన యువతితో పాటు మరో నలుగురిని చాదర్​ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్​పేట ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్​నగర్​కు చెందిన అయేషా ఫిర్దోస్(21) యాదగిరి థియేటర్ సమీపంలో ఉంటోంది. ఓల్డ్ సిటీలో ఎండీఎంఏ డ్రగ్​కు డిమాండ్ ఉండటంతో ఆమె సప్లయర్​గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో అమ్మేందుకు ఎండీఎంఏ డ్రగ్​ను ముంబయిలో కొని సిటీకి తీసుకొచ్చింది.

సోమవారం ఉదయం చాదర్ ఘాట్​కు చెందిన కస్టమర్లు కైజారుద్దీన్ అనస్ (21), సైదాబాద్ కాలనీకి చెందిన మహ్మద్ అఫన్(21), అయాజ్ ఖాన్(21), షాబాజ్ షరీఫ్​(21)కు అమ్మేందుకు యత్నించింది. అప్పటికే వీరిపై నిఘా పెట్టిన చాదర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్ పేటలోని నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద అయేషాతో పాటు నలుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. 8 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.