తల్లిదండ్రులు, తమ్ముడి కోసం.. ఎస్ఐ అవతారం

తల్లిదండ్రులు, తమ్ముడి కోసం.. ఎస్ఐ అవతారం
  •     ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్ 
  •     పేదరికాన్ని ఎదుర్కొని ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి 
  •     కంటి సమస్య వల్ల చేజారిన రైల్వే ఎస్ఐ జాబ్ 
  •     అప్పటికే జాబ్ వచ్చినట్టుగా ఊర్లో ప్రచారం
  •     పేరెంట్స్ బాధపడతారని.. ఊరివాళ్లు వెక్కిరిస్తారని ఎస్ఐగా వేషం 

సికింద్రాబాద్/నార్కట్​పల్లి, వెలుగు: ఆమె నిరుపేద కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎమ్మెస్సీ వరకూ చదివింది. రైల్వే ఎస్ఐ కావాలన్న తన డ్రీమ్ ను నిజం చేసుకునేందుకు శ్రమించింది. కానీ మెడికల్ టెస్టులో ఫెయిల్ కావడంతో జాబ్ చేజారిపోయింది. అప్పటికే జాబ్ కన్ఫమ్ అని చెప్పుకోవడంతో తల్లిదండ్రులు, ఇంటర్ చదువుతున్న తమ్ముడు ఎంతో సంతోషించారు. ఊరివాళ్లంతా ఆమె ఎస్ఐ అయిపోయిందని గొప్పగా చెప్పుకున్నారు. దీంతో జాబ్ రాలేదని తెలిస్తే ఇంట్లో వాళ్లు బాధపడతారని.. ఊర్లోవాళ్లు వెక్కిరిస్తారని ఆమె ఆందోళన చెందింది. 

అందుకే నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తింది. ఏడాది తర్వాత ఇప్పుడు నిజం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం రైల్వే ఎస్పీ షేక్ సలీమా మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా నార్కట్​పల్లికి చెందిన యాదయ్య కూతురు జడల మాళవిక(24) పేద కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఓయూ నిజాం కాలేజీలో ఎమ్మెస్సీ కెమిస్ర్టీ పూర్తి చేసింది. 

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్​పీఎఫ్)​లో సబ్ ఇన్ స్పెక్టర్ కావాలన్నది ఆమె డ్రీమ్. 2018లో ఆర్​పీఎఫ్ ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాసి పాస్ అయింది. ఈవెంట్స్ లోనూ సత్తా చాటింది. మెడికల్ టెస్టు ఒక్కటే మిగిలి ఉండటంతో ఎస్ఐ అయిపోయినట్టేనని భావించింది. జాబ్ కన్ఫమ్ అయినట్టు అందరికీ చెప్పుకున్నది. కానీ ఆమె కన్ను ఒకటి మెల్లగా ఉందంటూ మెడికల్ బోర్డు ఆమెను డిస్ క్వాలిఫై చేసింది. దీంతో తల్లిదండ్రులు బాధపడతారని ఆమె నకిలీ ఎస్ఐగా అవతారమెత్తింది. 

అచ్చం రైల్వే ఎస్ఐలా డ్రెస్ కోడ్.. 

ఎలాగైనా సరే ఎస్ఐగా చెలామణీ కావాలనుకున్న మాళవిక కొద్దిరోజులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు వచ్చి ఆర్​పీఎఫ్ పోలీసుల డ్రెస్​కోడ్ ను, బ్యాడ్జీలను, ఇతర అంశాలను పరిశీలించింది. తర్వాత ఎల్బీ నగర్ లోని ఓ టైలర్ షాపులో ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుంది. ఫేక్ ఐడీ కార్డు తయారు చేయించుకున్నది. సికింద్రాబాద్ లో ఆర్​పీఎఫ్ లోగో, స్టార్స్, షోల్డర్ స్టీల్ బ్యాడ్జీలు, నేమ్ ప్లేట్, బెల్ట్ కొనుగోలు చేసింది. ఆర్​పీఎఫ్ పోలీసుల లాగే డ్రెస్​ వేసుకుని రోజూ నల్గొండ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో ప్రయాణిస్తూ తనిఖీలు చేసేది. 

ఏడాది పాటు నకిలీ ఎస్ఐగా.. 

మాళవిక ఏడాదిగా నకిలీ ఎస్ఐగా కొనసాగింది. నల్గొండలో జరిగే చాలా కార్యక్రమాలకు ఎస్ఐ డ్రెస్​లోనే వెళ్లి హాజరయ్యేది. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలో జరిగిన కార్యక్రమంలో మహిళా సాధికారతపై స్పీచ్ సైతం ఇచ్చి ఆకట్టుకుంది. కొద్ది నెలల క్రితం నల్గొండలో విద్యార్థినుల కరాటే పోటీలకు హాజరైంది. 

ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సినీ హీరో సుమన్​తో కలిసి ఫోటోలు దిగింది. అలాగే ఎస్ఐ హోదాలో యాదగిరిగుట్ట టెంపుల్ కు వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. తల్లితో కలిసి సెక్రటేరియెట్ కు వచ్చి ఫొటోలు దిగింది. ఆమె ఎక్కడికి వెళ్లినా రీల్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తుండేది. చర్లపల్లి సెంట్రల్ జైలును కూడా సందర్శించి ఖైదీలను కలిసినట్లు వెల్లడైంది. 

పోలీసులకు దొరికిందిలా.. 

మాళవికకు ఓ యువకుడితో ఇటీవల పెండ్లి కుదిరింది. పెండ్లి కుదిరిన అబ్బాయి ఎంక్వైరీ చేయగా.. సికింద్రాబాద్ ఆర్​పీఎఫ్ స్టేషన్​లో మాళవిక పేరుతో ఎస్ఐ ఎవరూ లేరని పోలీసులు చెప్పారు. తాను నల్గొండ రైల్వే స్టేషన్ లో ఎస్ఐని అని కూడా మాళవిక చెప్పుకున్నట్టు తెలియడంతో రైల్వే పోలీసులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. ఈ నెల18న నల్గొండలో అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నిజాన్ని ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సెక్షన్170, 419, 420 కింద కేసు నమోదు చేశారు.

అమ్మానాన్నల కోసమే చేశా.. మోసాలు చేయలే: మాళవిక  

పోలీస్ డ్రెస్ వేసుకోవాలన్నది నా డ్రీమ్. మాది చాలా పేదకుటుంబం. ఎస్ఐ జాబ్ వస్తే దివ్యాంగులైన నా తల్లిదండ్రులు, ఇంటర్ చదివే తమ్ముడు సంతోషంగా ఉంటారని అనుకున్నా. అందుకే కష్టపడి చదివాను. ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యాను. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడ్డాను. తీరా మెడికల్ టెస్టులో కంటిలో మెల్ల వల్ల జాబ్ కోల్పోయాను. అప్పటికే మా ఊరిలో నేను ఎస్ఐ అయ్యానని ప్రచారం జరిగింది. జాబ్ రాలేదని తెలిస్తే మా అమ్మానాన్న బాధపడతారని, ఊరిలో అందరూ హేళన చేస్తారని అనుకున్నా. అందుకే ప్రచారాన్ని నిజం చేయాలని నకిలీ ఎస్ఐగా మారాను. అంతేతప్ప ఎస్ఐ డ్రెస్ ను అడ్డంపెట్టుకుని నేను ఎలాంటి మోసాలూ చేయలేదు.