మార్చి 31లోగా చేయాల్సిన ముఖ్యమైన పనులు

మార్చి 31లోగా చేయాల్సిన ముఖ్యమైన పనులు

మరో పది రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2023 ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2024 ప్రారంభమవుతుంది.  ఈ నేపథ్యంలో  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారు. అయితే నూతన ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మార్చి 2023 ఎంతో ముఖ్యమైంది. ఈ నెలలో తప్పనిసరిగా చేయాల్సిన  కొన్ని ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. మార్చి నెలలో ఈ పనులు చేయకపోతే జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.  అవేంటంటే..?

పాన్‌ ఆధార్ లింక్ 

పాన్-ఆధార్ లింక్ గడువును  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. మార్చి 31 తరువాత మళ్లీ పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాన్-ఆధార్ లింక్ చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయండి. ఒకవేళ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి వారి పాన్‌కార్డ్ పనిచేయకపోవచ్చు. మార్చి 31 లోపు లింక్ చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.  గడువు కంటే ముందు  ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే..రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.

 ఐటీఆర్ ఫైల్ చేయాలి.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం నిర్ణీత మొత్తంలో ఆదాయం సంపాదించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్  సమర్పించి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.  అయితే గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా లేదా ఫైల్‌ చేసిన రిటర్న్‌లో ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2022లో కేంద్రం తీసుకొచ్చిన ITR-U  ఆప్షన్‌ ద్వారా మళ్లీ ట్యాక్స్ రిటర్న్ ఫైల్‌ చేయవచ్చు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ITR-U ద్వారా సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసిన రెండు సంవత్సరాల వరకు తమ ITRలలో లోపాలు సరిచేసుకోవచ్చు. ఈ సదుపాయం ఒరిజినల్‌, బిలేటెడ్‌, రివైజ్డ్‌ ITRని ఫైల్ చేసిన లేదా చేయని వారికి కూడా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయకపోతే  లేదా అందులో ఏవైనా మిస్టేక్స్‌ గుర్తిస్తే 2023 మార్చి 31లోపు అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయవచ్చు.


ఫారం 12BB

ఫారమ్ 12BB ఫైల్ చేయడానికి చివరి తేదీ కూడా మార్చి 31. జీతం పొందే ఉద్యోగి తమ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు లేదా రాయితీలను క్లెయిమ్ చేయడానికి ఈ ఫారమ్‌ను తప్పనిసరిగా యజమానికి సమర్పించాలి. ఇది  2016 జూన్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ ఫారమ్‌లో తప్పనిసరిగా చేర్చాల్సిన కొన్ని అంశాలు ఇంటి అద్దె అలవెన్స్(HRA), లీవ్ ట్రావెల్ రాయితీలు (LTC),  హోమ్ లోన్‌పై వడ్డీ.

పన్ను ఆదా పెట్టుబడి

వేతన జీవులు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తూ ఉంటారు. ప్రొఫెషనల్స్ కూడా క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు.  ఈ క్రమంలోనే తాము  సంపాదించిన సొమ్ము ఆదా చేయడానికి గల మార్గాలపై చాలా మంది ఫోకస్ చేస్తుంటారు. అలా గరిష్ట మొత్తంలో పన్ను ఆదా చేయడానికి కొన్ని ముఖ్యమైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు ఉన్నాయి. అటువంటి పథకాలకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ కింద ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.  2023 మార్చి 31 ముందు పెట్టిన పెట్టుబడులు ఫైనాన్షియల్ ఇయర్ 2023 కు సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పాత ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపును పొందేందుకు అవకాశం ఉంటుంది.  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఐదేళ్ల  పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) వంటి ఐదు పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి.

ముందస్తు పన్ను చెల్లించండి

ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవాళ్లు, విడతల వారీగా ముందస్తుగానే పన్ను చెల్లించవచ్చు. ఈ పన్ను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించవచ్చు. బకాయి పన్నులో 15 శాతం జూన్ 15 నాటికి, తదుపరి 30 శాతం సెప్టెంబర్ 25 నాటికి, మరో 30 శాతం డిసెంబర్ 15 నాటికి, మిగిలిన 25 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 15 నాటికి చెల్లించబడుతుంది. ఉద్యోగులు, తమ జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ముందుగానే కట్‌ అయ్యేలా ఆప్షన్‌ పెట్టుకోవచ్చు. వ్యక్తి తన ఉద్యోగాన్ని మార్చుకున్నట్లయితే లేదా అదనపు ఆదాయాన్ని కలిగి ఉన్నట్లయితే, వారు మార్చి 31లోగా అదనపు పన్నును ముందుగానే లెక్కించి  చెల్లించాలి. ఆ తర్వాత ఆలస్యమైతే, పన్ను చెల్లింపుదారుడు చెల్లించాల్సిన మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు.