ఢిల్లీలో బీజేపీ, ఆప్.. పోటాపోటీ నిరసనలు

ఢిల్లీలో బీజేపీ, ఆప్.. పోటాపోటీ నిరసనలు
  • కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్

  • సెక్రటేరియెట్ ముట్టడికి యత్నం

  • వాటర్ కెనాన్​లు ప్రయోగించిన పోలీసులు

  • మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన ఆప్ లీడర్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, ఆప్ కార్యకర్తలు పోటాపోటీగా నిరసన తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్​ను ఖండిస్తూ.. ఆప్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు సెక్రటేరియెట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’.. ‘కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలు కూడా ఆప్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్​లు ప్రయోగించారు. ఢిల్లీ పోలీసులు 60 మంది బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా.. కేంద్ర వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ఆప్ నేతలు పటేల్ చౌక్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా లోక్ కల్యాణ్ మార్గ్​లోని ప్రధాని మోదీ ఇంటి వైపు బయలుదేరారు. దీనికి ముందే ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను అడ్డుకున్నారు. చుట్టు పక్క ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. సెంట్రల్ ఢిల్లీలో పారా మిలటరీ బలగాలను మోహరించారు. లోక్​కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్​ను మూసివేయించారు. పటేల్ చౌక్ ఎంట్రీ, ఎగ్జిట్​ను క్లోజ్ చేశారు. అదేవిధంగా సెంట్రల్ సెక్రటేరియెట్ మెట్రో స్టేషన్ సేవలు కూడా నిలిపివేశారు. పోలీసులు అడ్డుకోవడంపై ఢిల్లీ యూనిట్ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్, పార్టీ సీనియర్ లీడర్ సోమనాథ్ భారతి, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా, పంజాబ్ మినిస్టర్ హర్జోత్ సింగ్ మండిపడ్డారు. పోలీసులు ఢిల్లీని కోటలా మార్చారని, సిటీ అంతా 144 సెక్షన్ విధించారని మండిపడ్డారు. సిటీ పోలీస్ స్టేట్​గా మారిపోయినట్టు కనిపిస్తోందని విమర్శించారు. పోలీసులతో తమ పోరాటాన్ని అణచివేయలేరని ఫైర్ అయ్యారు. ఆప్ మహిళా నేతలు, కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లారన్నారు. మోదీ నియంత్రృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


సెక్రటేరియెట్​లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ లీడర్లు

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. మంగళ వారం ఫిరోజ్​షా కోట్లా స్టేడియం నుంచి ర్యాలీగా ఢిల్లీ సెక్రటేరియెట్ వైపు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ‘కేజ్రీవాల్ ఇస్తిఫా దో’.. ‘కేజ్రీవాల్ షర్మ్​ కరో’.. అంటూ నినాదాలు చేస్తూ సెక్రటేరియెట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు వాటర్ కెనాన్​లు ప్రయోగించారు. లిక్కర్ కేసు లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ లీడర్, ఎంపీ హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. ఈడీ కస్టడీ నుంచి ఆర్డర్లు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నిం చారు. కేజ్రీవాల్​పై చర్య లు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశామన్నారు. బీజేపీ నేతలను బహదూర్​షా జాఫర్ మార్గ్​లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆప్, బీజేపీ నేతల నిరసనలతో సెంట్రల్ ఢిల్లీలో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల పోలీసులు ముందే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.