
ముషీరాబాద్, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు. మెరుగైన జీవనం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రజాదరణతో తెలంగాణలో ఆప్ వేగంగా విస్తరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. ప్రజలు ఆశిస్తున్న ఫలాలను వారికి అందజేస్తున్నందుకే దేశంలోనే కోట్ల మంది ప్రజలు ఆప్‌ను ఆదరిస్తున్నారని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఆప్ జాతీయ పార్టీ హోదాను పొందడం అద్భుతం అని అన్నారు.