ఢిల్లీలో బీజేపీ పైశాచిక చర్యలను అడ్డుకుంటం

ఢిల్లీలో బీజేపీ పైశాచిక చర్యలను అడ్డుకుంటం
  • కేజ్రీవాల్ అరెస్ట్ మోదీ అప్రకటిత ఎమర్జెన్సీలో భాగమే
  • ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలతో పోరాడే దమ్ములేక ప్రధాని నరేంద్ర మోదీ అణిచివేత రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విమర్శించారు. దర్యాప్తు సంస్థల ముసుగులో ప్రతిపక్ష పార్టీలను, మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జెన్సీ విధించి, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీతో అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం లిబర్టీలోని ఆప్​ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ బూటకపు కేసులకు ఆప్ నేతలు భయపడరని, కేజ్రీవాల్​అరెస్టును నిరసిస్తూ ఈనెల 31న ఢిల్లీలో బీజేపీ పైశాచిక చర్యలను అడ్డుకుంటామని తెలిపారు. కేజ్రీవాల్​ను విడుదల చేయకుంటే  దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. చలో ఢిల్లీ వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.  సమావేశంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బుర్ర రాము గౌడ్, మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్, యమున గౌడ్, అధికార ప్రతినిధి జావేద్ షరీఫ్, దర్శనం రమేశ్, కొడంగల్ శ్రీనివాస్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.