ఢిల్లీ అల్లర్ల వెనుక ఆప్ నేత హస్తం

ఢిల్లీ అల్లర్ల వెనుక ఆప్ నేత హస్తం
  • ఆయనపై మర్డర్‌‌ కేసు.. పార్టీ నుంచి సస్పెండ్‌
  • ఐబీ స్టాఫ్ అంకిత్ శర్మ హత్యలో హస్తం ఉందని ఆరోపణలు
  • మా బిడ్డను చంపింది తాహిర్ మనుషులే: అంకిత్ పేరెంట్స్
  • నేను ఏ తప్పూ చేయలే.. సోమవారమే ఇల్లు ఖాళీ చేశా: తాహిర్
  • దుండగులు చొరబడి దాడులు చేశారని కామెంట్‌
  • మా పార్టీ వాళ్లది తప్పుంటే డబుల్ శిక్ష వేయండి: కేజ్రీవాల్

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర ఉందా? అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా? కేంద్ర ప్రభుత్వం ట్రంప్ పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పుడు అదను చూసుకుని దాడులకు తెగబడ్డారా? గురువారం బయట పడిన విషయాలను గమనిస్తే హింస వెనుక కుట్ర దాగుందని పోలీసులు భావిస్తున్నారు. అల్లర్లు ఆవేశంలో జరిగినవి కావని, ముందుగా స్కెచ్ వేసుకునే హింసకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఇంట్లో, మిద్దెపైన దొరికిన పెట్రోల్ బాంబులు, యాసిడ్ ప్యాకెట్లు, భారీగా రాళ్లు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్యలో కూడా తాహిర్ హస్తం ఉందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే తాహిర్​పై పోలీసులు మర్డర్ కేసు బుక్ చేశారు. అతడి ఇంటిని సీల్ చేసి.. రెయిడ్స్ చేస్తున్నారు. మాస్క్ వేసుకున్న కొందరు దుండగులతో తన ఇంటి మిద్దెపై తాహిర్ మాట్లడటం, వారికి ఆదేశాలిస్తుండటం, రాడ్డు పట్టుకుని తిరగడం కొన్ని వీడియోల్లో కనిపించిందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో తాహిర్​ను తమ పార్టీ నుంచి ఆప్ సస్పెండ్ చేసింది. హింసలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని, ఒకవేళ ఆప్ నేతల హస్తం ఉన్నట్లు తేలితే రెండింతల శిక్ష వేయాలని కేజ్రీవాల్ అన్నారు. అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది చనిపోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు 48 ఎఫ్ఐఆర్​లు నమోదు చేసి, 130 మందిని అరెస్టు చేశారు. రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి.

పదుల సంఖ్యలో అమాయకులను బలితీసుకున్న ఢిల్లీ హింసలో కొత్త ట్విస్ట్. అల్లర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహ్మద్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇంటి మిద్దె​పై పెట్రోల్ బాంబులతోపాటు డజన్ల కొద్దీ యాసిడ్ ప్యాకెట్లు, భారీ సంఖ్యలో రాళ్లు ఉండటమే ఇందుకు కారణం. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ సంచలన విషయాలు రాజకీయంగా కలకలం రేపాయి. అల్లర్లలో ఆప్ హస్తం ఉందని, తాహిర్ హుస్సేన్​ను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈమేరకు తాహిర్‌‌పై మర్డర్‌‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులుతెలిపారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆప్‌ వర్గాలు చెప్పాయి.

వీడియోలు వైరల్

పెట్రోల్ బాంబులు ఉన్న డబ్బాలు, రాళ్లతో నిండిన బస్తాలు, కొన్ని యాసిడ్ ప్యాకెట్లు తాహిర్ హుస్సేన్ ఇంటి పైన ఉన్నట్లు గురువారం ఉదయం తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ఇంటిపై నుంచి కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడం, పక్కనున్న మరో ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడం కనిపించింది. ఆ సమయంలో టెర్రస్​పైన భారీ సంఖ్యలో దుండగులు ఉన్నారు. మరో వీడియోలో తాహిర్ లాంటి బట్టలు వేసుకున్న వ్యక్తి.. బిల్డింగ్ లోకి ఎంటర్ కావాలంటూ దుండగులను ఆదేశించడం కనిపించింది. అయితే అక్కడ ఉన్నది తాహిరేనా కాదా అనేది వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. ఓ వీడియోలో తాహిర్‌‌ చేతిలో రాడ్డు పట్టుకొని బిల్డింగ్‌‌పై తిరుగుతూకనిపించింది.

ఐబీ స్టాఫ్ హత్యలో హస్తం?

ఇంటెలిజెన్స్ బ్యూరో స్టాఫ్ అంకిత్ శర్మ డెడ్ బాడీ నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని చాంద్​బాగ్ డ్రైనేజీలో బుధవారం దొరికింది. తాహిర్ ఇంటిపై నుంచి రాళ్లు విసిరిన వారే తమ కొడుకును హత్య చేశారని అంకిత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘‘మంగళవారం సాయంత్రం 5.30కి నా కొడుకు ఇంటికి వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత బయట పరిస్థితిని చూసేందుకు వెళ్లాడు. మళ్లీ రాలేదు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల దాకా మేం వెతికాం. డ్రైనేజీలో అతని డెడ్ బాడీ ఉందని 10 గంటలకు సమాచారం వచ్చింది. ఇలా అవుతుందని అనుకోలేదు” అని అంకిత్ తండ్రి దేవేంద్ర చెప్పారు. ‘‘నా కొడుకు ఇంటి నుంచి బయటికి వెళ్లగానే.. ఓ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. రాళ్లు, కత్తులతో దాడి చేసి చంపేశారు” అని అంకిత్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాహిర్ మనుషులే తమ బిడ్డను హత్య చేశారని వారు ఆరోపించారు.

నేనూ బాధితుడినే: ఆప్ నేత తాహిర్

‘‘నేను కూడా మూకదాడి బాధితుడినే. నా ఇంటిని దుండగులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల కిందట ఢిల్లీ పోలీసులు నన్ను రక్షించారు” అని ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ చెప్పారు. అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. తనపై వస్తున్నవి నిరాధార ఆరోపణలని అన్నారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని, తన తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఓ దుర్మార్గపు ప్రచారం. కొంతమంది డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు” అని ఆరోపించారు. గురువారం ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘హింస జరుగుతున్న సమయంలో నా ఇంట్లోకి ఓ గుంపు చొరబడింది. సాయం కోసం పోలీసులకు ఫోన్ చేశాను. కొన్ని గంటల తర్వాత పోలీసులు వచ్చారు. బిల్డింగ్​ను ఖాళీ చేయించారు. మొత్తం చెక్ చేశారు. నన్ను, నా ఫ్యామిలీని రక్షించారు. ఆ బిల్డింగ్ నుంచి పోలీసులను పంపేయొద్దని కోరాను. ఎందుకంటే దుండగులు మరోసారి ప్రవేశించి.. ఏమైనా తప్పుడు పనులు చేయొచ్చని చెప్పాను. కానీ అక్కడ సెక్యూరిటీ పెట్టలేదు’’ అని చెప్పారు.

ఆ ఏరియా ఇట్లయింది!

సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో నార్త్ ఈస్ట్ ఢిల్లీ తగులబడిపోయింది. అల్లరి మూకలు ఇళ్లు, షాపులు, వాహనాలు, పెట్రోల్ బంకులను తగులబెట్టాయి. స్థానికులు, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వాయి. జఫ్రాబాద్, మౌజ్​పూర్, బాబర్​పూర్, యమున విహార్, భజన్​పుర, చాంద్ బాగ్, శివ్ విహార్ ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ ఏరియాలు అల్లకల్లోల సిరియాను తలపిస్తున్నాయి. ఎటు చూసినా కాలిపోయిన ఇండ్లు, షాపులు.. రోడ్లపై రాళ్లు, గాజు పెంకులు కనిపిస్తున్నాయి. మీడియా పర్సన్లు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది తట్టబుట్ట సర్దుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

మార్చురీ దగ్గర పడిగాపులు

ఈశాన్య ఢిల్లీ  అల్లర్లలో చనిపోయిన వారి డెడ్‌‌బాడీస్‌‌ కోసం బంధువులు జీటీబీ హాస్పిటల్‌‌  మార్చురీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అల్లర్లు జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన తమ వారు చనిపోయారా లేదా వాళ్లకు ట్రీట్​మెంట్ జరుగుతోందా  తెలుసుకునేందుకు హాస్పిటల్​ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. “ రెండు రోజుల నుంచి హాస్పిటల్‌‌ మార్చురీ దగ్గరే ఉన్నాం. ఫైల్స్‌‌ రెడీ అవుతున్నాయని, పోస్ట్‌‌మార్టం చేసి డెడ్‌‌బాడీ ఇస్తామని చెప్తున్నారు” అని  అల్లర్లలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

‘అల్లర్లను రాజకీయం చేస్తున్నారు’

ఢిల్లీ అల్లర్లపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఢిల్లీ లో హింసాత్మక ఘటనలపై యూఎస్ కమిషన్ ఆన్​ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సెక్యూరిటీ ఇవ్వాలంటూ  కేంద్రానికి  సూచించింది. దీనిపై మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ రియాక్టయ్యారు. ఢిల్లీ అల్లర్లపై జరుగుతున్న ప్రచారం సమస్యను రాజకీయం చేసే కోణంలోనే జరుగుతోందన్నారు.  అమెరికా  ప్రెసిడెన్షియల్​ కేండిడేట్​  బెర్నీ శాండర్స్ తో పాటు చాలా మంది అమెరికన్  ఎంపీలు, కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు చేస్తున్న కామెంట్లు సరికావని ఆయన చెప్పారు.

షాపులు బంద్

ఈశాన్య ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న గొడవల కారణంగా వ్యాపారులు షాపులను మూసేశారు. గొడవలు జరిగిన జఫ్రాబాద్‌‌, మౌజ్‌‌పూర్‌‌‌‌, చాంద్‌‌బాగ్‌‌ , గోకుల్​పురి చుట్టుపక్కల ఏరియాల్లో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా దుకాణాలు మూసేసినట్లు షాపు ఓనర్లు  చెప్పారు. దీంతో నిత్యావసరాలు దొరక్క జనం ఇబ్బంది పడ్డారు.

వాట్సాప్‌‌పై నిఘా

ఈశాన్య ఢిల్లీలో గొడవలు సృష్టించేందుకు సోషల్‌‌మీడియా ఫ్లాట్‌‌ఫామ్ వాట్సాప్‌‌ను ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పోలీసులు వాట్సాప్‌‌పై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. గొడవల్లో పాల్గొన్న 50 మంది మొబైల్‌‌ ఫోన్లను సీజ్‌‌ చేసిన పోలీసులు.. వారందరూ వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్‌‌ అయ్యారని పోలీసులు అభిప్రాయపడ్డారు. యూపీ నుంచి వచ్చే కిరాయి రౌడీలకు డైరెక్షన్స్‌‌ ఇచ్చేందుకు కూడా వాట్సాప్‌‌నే ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

హంతకుడు తాహిరే

తాహిర్ హుస్సేనే హంతకుడు. అంకిత్ శర్మను మాత్రమే కాదు.. మరో నలుగురు యువకులను లాక్కెళ్లారు. వారిలో ముగ్గురు చనిపోయారు. కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాంబులతో తిరుగుతున్న కొందరు యువకులతో తాహిర్ హుస్సేన్ ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది. కేజ్రీవాల్, ఆప్ లీడర్లతో తాహిర్ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు.

– బీజేపీ నేత కపిల్ మిశ్రా