
శ్రావణమాసం, కార్తీకమాసం వచ్చిందంటే నాన్ వెజ్ తినడం మానేసేవారు చాలామంది ఉంటారు. మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా నాన్ వెజ్ తినేవారైనా సరే.. ఈ మాసాల్లో నాన్ వెజ్ కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోరు. కొంతమంది మాత్రం ఇవేమి పట్టించుకోకుండా మాములు రోజుల్లో లాగే నాన్ వెజ్ తింటూ ఉంటారు... ఎవరి నమ్మకాలు వారివి. ఆయా మాసాల్లో నాన్ వెజ్ తింటే దేవుడిపై భక్తి లేనట్లని చెప్పలేం. అయితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రావణమాసంలో నాన్ వెజ్ అమ్ముతున్నారంటూ KFC రెస్టారెంట్ మీద దాడి చేశారు హిందూ సంఘాల వారు. శుక్రవారం ( జులై 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
శ్రావణమాసంలో కూడా నాన్ వెజ్ అమ్ముతున్నారంటూ ఘజియాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్లు KFC, నజీర్ ఫుడ్స్ పై దాడి చేశారు హిందూ రక్షా దళ్ సభ్యులు. కస్టమర్స్ సమక్షంలోనే రెస్టారెంట్లను బలవంతంగా మూసేశారు సభ్యులు.ఘజియాబాద్‌లోని వసుంధర ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రావణమాసం కావడం, కన్వర్ యాత్ర జరిగే సమయంలో సంబంధిత ప్రాంతంలో నాన్ వెజ్ అమ్మకాల నిషేధం ఉన్నప్పటికీ అమ్మకాలు జరుగుతుండటంతో హిందూ రక్షా దళ్ సభ్యులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read:-కర్ణాటక సిఎం 'చనిపోయినట్లు' తప్పుగా మార్చిన మెటా.. సిఎంఓ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్
ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రెస్టారెంట్లపై దాడికి దిగారు హిందూ రక్షా దళ్ సభ్యులు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షట్టర్లను మూసేసారు సభ్యులు. ఇది హిందూస్తాన్.. హిందువులు ఎలా చెబితే అలా నడుచుకోవాలంటూ KFC సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు ఆందోళనకారులు.