కేజ్రీవాల్​ ఆరోగ్యంపై ఆప్ నేతల టెన్షన్..అధికారులు పట్టించుకోవట్లే: ఆతిశీ

కేజ్రీవాల్​ ఆరోగ్యంపై ఆప్ నేతల టెన్షన్..అధికారులు పట్టించుకోవట్లే: ఆతిశీ
  •     12 రోజుల్లో 4.5 కిలోలు తగ్గారు
  •     సీఎం ఆరోగ్యంగానే ఉన్నారని జైలు అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ :  అర్వింద్ కేజ్రీవాల్​ను ఫేక్ కేసులో జైల్లో పెట్టారని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. మార్చి 21న కేజ్రీవాల్​ను అరెస్ట్ చేశారని, అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. 4.50 కిలోల బరువు తగ్గారని, బ్లడ్​లో షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయిలో పడిపోయాయని తెలిపారు. కేజ్రీవాల్​ను బీజేపీ సర్కార్ కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. 

సీఎం హెల్త్ కండీషన్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయం కోసం పోరాడుతుందన్నారు. జ్యూడీషియల్ కస్టడీకి తీసుకున్నప్పటి నుంచి ఆయన వెయిట్ లాస్ అవుతున్నారని బుధవారం నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆరోపించారు. కేజ్రీవాల్​కు ఏమైనా అయితే.. దేశ ప్రజలతో పాటు ఆ దేవుడు కూడా బీజేపీని క్షమించడని అతిశీ అన్నారు. కాగా, కేజ్రీవాల్ హెల్త్ కండీషన్ బాగుందని, భయపడాల్సిన అవసరంలేదని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.

నన్ను అవమానించడమే ఈడీ లక్ష్యం: కేజ్రీవాల్

తనను అవమానించడమే ఈడీ ఏకైక లక్ష్యమని కేజ్రీవాల్ కోర్టుకు చెప్పారు. తన అరెస్ట్​ను సవాల్ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ బెంచ్​ కేసును విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.ఇరుపక్షాల మధ్య వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్లాన్ ప్రకారమే తన క్లయింట్​ను అరెస్ట్ చేశారని సింఘ్వి ఆరోపించారు.

 అప్రూవర్లుగా మారిన నిందితులను బలవంతపెట్టి వారితో కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించిందని ఈడీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ సరికాదన్నారు. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ‘ఎవరైన పొలిటికల్ లీడర్ ఎన్నికలకు ముందు మర్డర్ చేశాడనుకుందాం. అతన్ని అరెస్ట్ చేయొద్దా? ఎన్నికలు ఉన్నాయని వదిలిపెట్టాలా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. ఎలక్షన్లు ఉన్నాయనే తనను అరెస్ట్ చేశారనడం హాస్యాస్పదం’’అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. తీర్పును రిజర్వ్​లో పెట్టింది.​