ఢిల్లీ మేయర్ ఎన్నిక: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్

ఢిల్లీ మేయర్ ఎన్నిక: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్

ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఆప్, బీజేపీల ఆందోళనతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ పై న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. కాగా నిన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా.. నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుతివ్వడంపై దుమారం రేగింది. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1957 ప్రకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఓటు వేయడానికి ఆల్డర్‌మన్ అర్హులని  ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ  తెలిపారు. ఈ చట్టం ప్రకారం 25 ఏళ్లు పైబడిన 10 మందిని  లెఫ్ట్ నెంట్ గవర్నర్  కార్పొరేషన్‌కు నామినేట్ చేయవచ్చు, అయితే 10 మంది బీజేపీ సభ్యులను ఆల్డర్‌మెన్‌గా ఎన్నుకోవడంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్  నిబంధనలను ఉల్లంఘించారని AAP ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్  సభ్యుల వాగ్వాదాలతో MCD సమావేశాలు గందరగోళంగా మారాయి. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది.