WCL 2025: డివిలియర్స్ మరోసారి విధ్వంసం.. ఈ సారి 39 బంతుల్లోనే సెంచరీ

WCL 2025: డివిలియర్స్ మరోసారి విధ్వంసం.. ఈ సారి 39 బంతుల్లోనే సెంచరీ

సౌతాఫ్రికా మాజీ విధ్వంసకర బ్యాటర్.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లో ఊర మాస్ బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఈ సఫారీ వీరుడు ఈ లీగ్ లో రెండో మెరుపు  సెంచరీ చేసి తన విశ్వరూపం చూపించాడు. ఆదివారం (జూలై 27) డబ్ల్యూసీఎల్ లో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ పై 39 బంతుల్లోనే సెంచరీ చేసి తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ను మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఓవరాల్ గా 46 బంతుల్లోనే 123 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 

డివిలియర్స్ ఇన్నింగ్స్ లో 15 ఫోర్లతో పాటు 8 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ గా బరిలోకి దిగిన డివిలియర్స్ ఆరంభం నుంచి ఎదురు దాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్టేడియాన్ని హోరెత్తించాడు. డివిలియర్స్ విధ్వంసానికి ఆసీస్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. 22 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్న ఏబీడీ.. ఆ తర్వాత 50 పరుగుల మార్క్ అందుకోవడానికి 17 బంతులే అవసరమయ్యాయి. ఇదే టోర్నీలో అంతకముందు ఇంగ్లాండ్ ఛాంపియన్స్ పై డివిలియర్స్ 41 బంతుల్లో సెంచరీ చేయగా.. భారత ఛాంపియన్స్ పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

41 ఏళ్ల ఏబీ డివిలియర్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ లీగ్ 2024లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెన్ డంక్, సౌతాఫ్రికా బ్యాటర్ సరెల్ ఎర్వీ.. పాకిస్తాన్‌ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఒక్కొక్క సెంచరీ సాధించారు. 14వ ఓవర్‌లో ఎట్టకేలకు డివిలియర్స్ విధ్వంసానికి తెర పడింది. సిడిల్ బౌలింగ్ లో ఔటవ్వడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. 

►ALSO READ | IND vs ENG 2025: 64 ఓవర్లు.. 6 వికెట్లు: గిల్ వీరోచిత సెంచరీ.. డ్రా కోసం పోరాడుతున్న టీమిండియా

ఈ లీగ్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లోనే డివిలియర్స్ 302 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 2018లో కేవలం 34 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యానికి గురి చేశాడు. వన్డేల్లో 31 బంతుల్లో సెంచరీ చేసిన ఫాస్టెస్ట్ రికార్డ్ డివిలియర్స్ పేరిట ఉండడం విశేషం. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. డివిలియర్స్ పాటు ఓపెనర్ స్మట్స్ 85 పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. తొలి వికెట్ కు డివిలియర్స్, స్మట్స్ 13.3 ఓవర్లలోనే 187 పరుగులు జోడించడం విశేషం.