IPL 2025: టైటిల్ మనదే.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి: RCBకి డివిలియర్స్ కీలక సలహా

IPL 2025: టైటిల్ మనదే.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి: RCBకి డివిలియర్స్ కీలక సలహా

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆదివారం (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో వరుసగా రెండో సారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. 2024 సీజన్ లో కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 17 సీజన్ లుగా ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేకపోయిన బెంగళూరు జట్టుకు ఈ ఏడాది ట్రోఫీ అందుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. 

పటిదార్ సేనకు ప్లే ఆఫ్స్ కు ముందు ఒక కీలక సలహా ఇచ్చాడు. జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యమని చెప్పాడు. డివిలియర్స్ మాట్లాడుతూ.. " మనం ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాం. నేను చెప్పేది ఒక్కటే ముందుగా అందరూ ఫిట్ గా ఉండండి.   దయచేసి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోండి. గాయాల సమస్యలు నన్ను చంపేస్తున్నాయి. ఈ సీజన్ లో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశమని నేను భావిస్తున్నాను. జట్టు ఊపు మీదుంది. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మనకు విరాట్ లాంటి ఒక లెజండ్ ఉన్నాడు. దయచేసి అందరూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టండి". అని ఈ మాజీ ఆర్సీబీ ప్లేయర్ అన్నాడు. 

ALSO READ | ఆసియా కప్ 2025 వైదొలిగిన భారత్.. ఏసీసీకి తేల్చి చెప్పిన బీసీసీఐ..!

ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పటిదార్ సేన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే టాప్ 2 లో నిలుస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. మే 23 న సన్ రైజర్స్ హైదరాబాద్‎తో.. మే 27 న లక్నో సూపర్ జయింట్స్‎తో తలపడనుంది.