
పాపం.. వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా పరిస్థితి చూస్తుంటే జాలేస్తున్నది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్నా.. సమష్టిగా ఆడటంలో విఫలమవుతున్నది. ఇలాంటి స్థితిలో ‘మిస్టర్ 360’ డివిలియర్స్ టీమ్‌లో ఉంటే బాగుండేదని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో ఆడాలని డివిలియర్స్ ప్రయత్నాలు చేసినా.. మేనేజ్‌మెంట్ పెడచెవిన పెట్టినట్లు సమాచారం. 2018 మే నెలలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచిన ఏబీ.. వరల్డ్‌కప్ నేపథ్యంలో మళ్లీ జట్టులోకి రావాలని భావించాడు. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ గిబ్సన్‌తో పంచుకున్నాడు. వాళ్లిద్దరు సుముఖంగా ఉన్నా.. సౌతాఫ్రికా బోర్డు మాత్రం మోకాలడ్డిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏబీ అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోకుండా వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ‘మళ్లీ వస్తానని డివిలియర్స్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుసు. కానీ నిబంధనల ప్రకారం అతన్ని పక్కనబెట్టక తప్పలేదు. ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని 2018లోనే చెప్పా. కానీ అతను వినలేదు. వీడ్కోలు నిర్ణయంతో సంతోషంగా ఉన్నా అని చెప్పాడు. చివరకు ఏప్రిల్ 18న మేం జట్టును ప్రకటించే 24 గంటల ముందు డుప్లెసిస్, గిబ్సన్.. డివిలియర్స్ విషయాన్ని బయటపెట్టారు. ఆ సమ యంలో ఎలాంటి నిర్ణయం తీసుకో లేకపోయాం’ అని సీఎస్‌ఏ సెలెక్షన్ ప్యానెల్ కన్వీనర్ లిండా వ్యాఖ్యానించాడు.