Coolie Movie : రజనీకాంత్ "కూలీ" ఫీవర్.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ!

Coolie Movie : రజనీకాంత్ "కూలీ" ఫీవర్..  ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) మేనియా మరోసారి దేశాన్ని చుట్టేస్తోంది. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "కూలీ" (  Coolie )ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం అన్ని హద్దులు దాటింది. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై నెలకొన్న హైప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా సెలవు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ఉద్యోగుల కంపెనీ సెలవు  
చెన్నైకి చెందిన ఉనో ఆక్వా కేర్ అనే కంపెనీ, తమ ఉద్యోగులకు సినిమా చూసే అవకాశం కల్పించడానికి, ఆగస్టు 14న పూర్తి సెలవు దినంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక అధికారిక నోటీసును విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి వంటి ప్రముఖ నగరాలతో పాటు, అన్ని బ్రాంచ్‌లలోని ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని నోటీసులో పేర్కొన్నారు. 

ALSO READ : షాక్ ఇస్తున్న తారక్ వాచ్ ధర..

ఉచితంగా 'కూలీ' టిక్కెట్లు!
అయితే, ఈ సెలవు ప్రకటన కేవలం సినిమా చూడటానికి మాత్రమే పరిమితం కాలేదు.  రజనీకాంత్ సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఈ సెలవును ఒక పండుగలా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు చాక్లెట్లు, ఉచిత "కూలీ" టికెట్లు పంపిణీ చేయనుంది. అంతేకాకుండాఅనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలో ఆహారం వితరణ చేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టనుంది.  అలాగే సినిమా పైరసీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ద్వారా తమ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది.

బాక్సాఫీస్‌ వద్ద సునామీ
అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే, "కూలీ" బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.5.55 కోట్లు దాటగా, బ్లాక్ సీట్లు కలుపుకొని మొత్తం రూ.10.27 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో అయితే ఈ మొత్తం రూ.37 కోట్లు దాటింది.  ఇది ఒక భారతీయ సినిమాకు అరుదైన ఘనత నిలిచిపోతోంది.  ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ100 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ అనలిస్టుల అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే "కూలీ" ఒక కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది.

ఈ'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,   సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.  మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే.