మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆర్‌జేడీ నేత సంచలన వ్యాఖ్యలు

 మహిళా రిజర్వేషన్ బిల్లుపై  ఆర్‌జేడీ  నేత సంచలన వ్యాఖ్యలు

ఆర్‌జేడీ సీనియర్ నేత, మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కోటా కల్పించకపోవడంపై ఆయన మాట్లాడుతూ  మహిళా రిజర్వేషన్ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు కచ్చితమైన   కోటా కల్పిస్తే మంచిదే అన్న ఆయన లేదంటే  లిప్‌స్టిక్‌లు, పౌడర్,  మోడ్రన్ హెయిర్‌స్టైల్‌తో ఉన్న మహిళలే రిజర్వేషన్లు పొందుతారు. అలా అయితే మీకు హక్కు దక్కుతుందా అంటూ మహిళలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.  

ప్రస్తుతం ఉన్న మహిళా రిజర్వేషన్ విధానంలో అత్యంత వెనుకబడిన తరగతుల మహిళలకు కోటా కల్పించాలని సిద్ధిఖీ డిమాండ్ చేశారు.  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధిఖీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సిద్ధిఖీ చేసిన ఈ ప్రకటనపై దుమారం రేగుతోంది. అబ్దుల్ బారీ సిద్ధిఖీ ప్రకటన మహిళా వ్యతిరేకి అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. మిత్రపక్షాలు కూడా ఆయన్ను  వ్యతిరేకించడం ప్రారంభించాయి.

ఇదిలా ఉండగా, ఆర్జేడీ అధికార ప్రతినిధి అజాజ్ అహ్మద్ సిద్ధిఖీ ప్రకటనకు మద్దతు ఇచ్చారు., సిద్ధిఖీ చెప్పిన దానిలో  సత్యం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్‌లో చాలా మంది ప్రజలు తమ హక్కులు పొందకపోతే ఈ బిల్లుకు  న్యాయం జరగదన్నారు.  సిద్ధిఖీ ప్రకటనలోని అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు  రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.