జన జాతర..  ఆరు గ్యారెంటీలకు వెల్లువలా దరఖాస్తులు

జన జాతర..  ఆరు గ్యారెంటీలకు వెల్లువలా దరఖాస్తులు
  • పండుగలా ప్రజాపాలన
  • వెల్లువలా దరఖాస్తులు
  • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఆరు గ్యారెంటీలకే అప్లికేషన్లు
  • పింఛన్ లబ్ధిదారులు అర్జీలు పెట్టొద్దని క్లారిటీ
  • వార్డుల్లో ఉచితంగా ఫారాల పంపిణీ

హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు రాజధాని నుంచి భారీగా జనం గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచే పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరారు. మున్సిపాలిటీల్లోని వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలకు జనం జాతరలా తరలివస్తున్నారు.

వంద దరఖాస్తులు తీసుకునేందుకు వీలుగా ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేశారు. అయితే భారీ సంఖ్యలో జనం తరలివస్తుండటంతో అప్లికేషన్ ఫారాలు చాలడం లేదు. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారాన్ని 20 నుంచి 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా ఫారాలు అందిస్తామని ఎట్టి పరిస్థితిలోనూ కొనుగోలు చేయవద్దని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. అప్లికేషన్ తో పాటు అటాచ్ చేసే జిరాక్స్ కాపీల కోసం జనం పరుగులు తీస్తున్నారు. దీంతో జిరాక్స్ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. ఇదే అదనుగా ఒక్కో ప్రింటవుట్ కు రూ. 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. 

పింఛన్ లబ్ధిదారులు దరఖాస్తు పెట్టొద్దు

ఇప్పికే ఆసరా  పింఛన్ పొందుతున్నవారెవరూ మళ్లీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కొత్తగా చేయూత పింఛన్ కోసం మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా పంపిణీ చేస్తామని, బయట కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు.

8 రోజుల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చు

గ్రామసభ జరిగిన రోజు మిస్సయిన వారు  పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో తమ దరఖాస్తులను ఇవాళ్టి నుంచి జనవరి 6వ తేదీలోపు ఎప్పుడైనా దరఖాస్తులు ఇవ్వవచ్చని, మిస్సవుతామని ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు.